Bangkok : షాపింగ్‌మాల్‌లో కాల్పులు

థాయిల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మంగళవారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఆ నగరంలోనే అత్యంత పెద్దదైన సియాం పారగాన్ మాల్‌లో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కాల్పుల ఘటన చోటుచేసుకున్న గంట సేపటికే అనుమానితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. పొడవాటి జుట్టు కలిగిన ఓ యువకుడు పోలీసుల కస్టడీలో ఉండడం కనిపించింది. అతడి వయసు 14 ఏళ్లేనని థాయ్‌ల్యాండ్‌లో ప్రధాన మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పోలీసు విభాగం అధిపతి టొర్‌సాక్ సుక్విమోల్ మాత్రం.. ‘‘నిందితుడు మైనర్. మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు’’ అని చెప్పారు. మరణించిన ఇద్దరిలో ఒకరు మయన్మార్ జాతీయుడని, మరొకరు చైనీయుడని తెలిపారు. అంతకుముందు ఎరావన్ అత్యవసర వైద్య కేంద్రం డైరెక్టర్ యుథానా శ్రీథనన్ మాట్లాడుతూ.. కాల్పుల్లో ముగ్గురు మరణించారని, ఆరుగురు గాయపడ్డారని చెప్పారు. ఆ తర్వాత మరణించింది ఇద్దరేనని వెల్లడించారు. ప్రస్తుతం మాల్‌లో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.