Australia’s intelligence chief – ట్రూడో ఆరోపణలను విభేదించడానికి కారణం లేదు

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ట్రూడో చేసిన వ్యాఖ్యలను తాజాగా ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మైక్ బర్జెస్( Australian intelligence chief Mike Burgess) సమర్థించడం గమనార్హం. ట్రూడో ప్రకటనతో విభేదించేందుకు తనకు ఎటువంటి కారణం కనిపించడం లేదన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఫైవ్ ఐస్ కూటమి(Five Eyes) భాగస్వాముల సమావేశంలో పాల్గొన్న సమయంలో విలేకర్ల వద్ద ఈ విధంగా స్పందించారు.
‘కెనడా ప్రభుత్వం(Canada) చేసిన వ్యాఖ్యలతో విభేదించేందుకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. అవి తీవ్రమైన ఆరోపణలు. అలాంటి చర్యలకు ఏ దేశమూ పాల్పడకూడదు’ అని బర్జెస్ వ్యాఖ్యానించారు. అలాగే భారత ఏజెంట్ల తదుపరి లక్ష్యం ఆస్ట్రేలియా అవుతుందా? అని ప్రశ్నించగా.. ‘ఇలాంటి విషయాలపై నేను బహిరంగంగా ఊహాగానాలు చేయను. అది సరైన పద్ధతి కాదనుకుంటున్నాను. మా దేశంలో ఇతర ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయని లేదా ఆ రకంగా ప్రణాళికలు వేస్తున్నాయని గుర్తిస్తే.. అటువంటి పరిస్థితులను మేము సమర్థవంతంగా డీల్ చేస్తామని చెప్పగలను’ అని అన్నారు.
దాదాపు నెలక్రితం ట్రూడో చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత్‌లోని కెనడా(Canada)కు చెందిన సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఆ దేశ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవాలని డిమాండ్ చేసింది. ఆ డిమాండ్‌కు తగ్గట్టే.. కొందరు దౌత్యవేత్తలను తగ్గించుకున్నట్లు ఇటీవల కెనడా తెలిపింది. మరోపక్క ఈ దౌత్యపరమైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, కెనడా విదేశాంగమంత్రులు అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఈ భేటీ గురించి ఇరు దేశాల విదేశాంగ శాఖల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కాగా.. ‘ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్’లో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా సభ్యదేశాలు.