#International news

Another Khalistani- కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హతమయ్యాడు

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది. కెనడా (Canada)లో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్‌స్టర్‌ సుఖ్‌దోల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖా దునెకే (Gangster Sukha Duneke) మరణించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. కాగా.. ఈ హత్య తమ పనేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించుకుంది.

పంజాబ్‌ (Punjab)లోని మోఘా జిల్లాలో దేవిందర్‌ బంబిహా గ్యాంగ్‌కు చెందిన సుఖా దునెకేపై భారత్‌లో పలు క్రిమినల్‌ కేసులున్నాయి. 2017లో అతడు నకిలీ ధ్రవ పత్రాలతో కెనడాకు పారిపోయినట్లు సమాచారం. అక్కడకు వెళ్లిన తర్వాత కెనడా కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్‌ అర్షదీప్‌ సింగ్‌ ముఠాలో చేరినట్లు నిఘా వర్గాల సమాచారం. ఖలిస్థానీ ఉద్యమంలో సుఖా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

పంజాబ్‌కు చెందిన దాదాపు 30 గ్యాంగ్‌స్టర్లు ప్రస్తుతం భారత్‌లో కేసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలకు పారిపోయినట్లు నిఘా వర్గాల సమాచారం. వీరు తప్పుడు ప్రయాణ పత్రాలతో లేదా దేశ సరిహద్దులు దాటి నేపాల్‌ మీదుగా ఇతర దేశాలకు వెళ్లి అక్కడ అక్రమంగా ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో 8 మంది కెనడాలో ఉన్నట్లు సమాచారం. అందులో ఒకడైన సుఖా తాజాగా కాల్పుల్లో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే, హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య కేసులో భారత్‌, కెనడా మధ్య వివాదం రాజుకున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత అయిన నిజ్జర్‌ ఈ ఏడాది జూన్‌లో కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల దుండగులు అతడిని కాల్చి చంపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *