America President – జో బైడెన్ ఇజ్రాయెల్‌లో

ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం (Israel Hamas conflict) కొనసాగుతోన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా టెల్‌అవీల్‌లో దిగిన బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యూహు (Benjamin Netanyahu), అధ్యక్షుడు ఇసాక్ ఎర్జోగ్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడిన బైడెన్.. హమాస్ మిలిటెంట్లు దుర్మార్గాలకు పాల్పడ్డారని అన్నారు. ఇటువంటి సమయంలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తోన్న పోరుకు అమెరికా మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని చెప్పడానికి ఇక్కడ అడుగుపెట్టినట్లు స్పష్టం చేశారు.
‘నేను ఇక్కడకు రావడానికి ఒకేఒక చిన్న కారణం. అమెరికా ఎవరివైపు ఉంటుందనే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజలతో పాటు యావత్ ప్రపంచానికి చెప్పడానికే ఇక్కడకు వచ్చా. హమాస్ మిలిటెంట్లు దుశ్చర్యలకు పాల్పడ్డారు. అవి ఐఎస్‌ఐఎస్ మాదిరిగానే ఉన్నాయి. పాలస్తీనియన్లందరికీ హమాస్ ప్రాతినిధ్యం వహించడం లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది వారికి బాధలనే మిగిల్చింది’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. హమాస్ మిలిటెంట్ల దాడిలో 1400లకు పైగా ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సంఘీభావంగా జో బైడెన్ అక్కడ పర్యటిస్తున్నారు. ఓవైపు హమాస్ దాడులు, మరోవైపు గాజాపై ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అగ్రరాజ్య అధ్యక్షుడు ఈ అరుదైన పర్యటన చేయడం గమనార్హం.
మరోవైపు సెంట్రల్ గాజాలోని అహ్లీ అరబ్ ఆసుపత్రిపై జరిగిన భారీ దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంలో జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఈ దాడులపై ఇజ్రాయెల్-గాజా అధికారుల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. అది ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడి అని గాజా పేర్కొనగా.. ఇజ్రాయెల్ మాత్రం ఆ దాడులు హమాస్‌లు ప్రయోగించిన రాకెట్లు మిస్‌ఫైర్ అయినట్లు చెబుతోంది. మరోవైపు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఈ వారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు సమాచారం.