America President – జో బైడెన్ స్పందించారు

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర పోరుతో గాజాలో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో శనివారం విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు. గాజాలో మానవతా సంక్షోభాన్ని నివారిద్దామని వారిని కోరారు. అక్కడి సామాన్య ప్రజలకు సహాయం కొనసాగించేందుకు అనుమతించాలని విన్నవించారు. ఇందుకోసం ఐక్యరాజ్య సమితి, ఈజిప్టు, జోర్డాన్‌లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఘర్షణ మరింత విస్తరించకుండా చూడాలని ఇరువురు నేతలకు సూచించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు ఇటీవల రాకెట్ దాడులకు తెగబడినప్పటి నుంచి నెతన్యాహుతో బైడెన్ ఫోన్‌లో మాట్లాడటం ఇది ఐదోసారి. హమాస్ దాడుల తర్వాత అబ్బాస్‌తో సంభాషించడం మాత్రం ఇదే మొదటిసారి. పాలస్తీనా ప్రజల అస్తిత్వం, గౌరవానికి హమాస్ ఉగ్ర ముఠా దర్పణం పట్టదని అబ్బాస్‌తో బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని నెతన్యాహుతో సంభాషణలో పునరుద్ఘాటించారు.
గాజాపై ఇజ్రాయెల్ తాజా దాడులను చైనా తప్పుబట్టింది. ఆత్మరక్షణ పరిధికి మించి ఇజ్రాయెల్ విధ్వంసానికి పాల్పడుతోందని విమర్శించింది. శాంతి చర్చలు జరపాలని, వెంటనే దాడులను ఆపేయాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పిలుపునిచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై అమెరికా-చైనా విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. యుద్ధం విస్తరించకుండా నిరోధించేందుకు చైనా సహకారాన్ని అమెరికా కోరినట్లు సమాచారం.