America President – ఇజ్రాయెల్‌లో జో బైడెన్ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి!

హమాస్ దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి! రాబోయే కొన్ని రోజుల్లోనే ఆ దేశానికి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికైతే పర్యటన ఖరారు కాలేదని స్పష్టం చేశాయి. బైడెన్ ఇజ్రాయెల్‌కు వెళ్తే.. హమాస్ దాడుల నేపథ్యంలో ఆ దేశానికి అమెరికా బలమైన మద్దతును పునరుద్ఘాటించినట్లవుతుంది. అయితే హమాస్ మిలిటెంట్లకు అండగా నిలుస్తున్న ఇరాన్‌కు మాత్రం ఆయన పర్యటన తీవ్ర ఆగ్రహం తెప్పించే అవకాశాలు ఉన్నాయి.
గాజాలో దాడులకు దిగిన ఇజ్రాయెల్ బలగాలు అక్కడ ఎక్కువ కాలం ఉండకపోవచ్చని బైడెన్ అభిప్రాయపడ్డారు. గాజాను ఇజ్రాయెల్ తిరిగి ఆక్రమిస్తే మాత్రం అది పెద్ద పొరపాటు అవుతుందని వ్యాఖ్యానించారు. సీబీఎస్ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.