America has responded to the tensions between India and Canada – భారత్-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అగ్రదేశం అమెరికా స్పందించింది

ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనడానికి విశ్వసనీయమైన సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలపై అమెరికా స్పందించింది. ఆయన ప్రస్తావించిన అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శ్వేతసౌధ కౌన్సిల్ ప్రతినిధి అడ్రియెన్నె వాట్సన్ స్పందించారు.
‘కెనడా ప్రధాని ట్రూడో ప్రస్తావించిన ఆరోపణలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. కెనడా భాగస్వామ్య పక్షాలను మేం నిత్యం సంప్రదిస్తూనే ఉన్నాం. కెనడా దర్యాప్తును కొనసాగించడం, బాధ్యులకు శిక్ష పడటం ఇక్కడ కీలకం’ అని శ్వేతసౌధ ప్రతినిధిని ఉటంకిస్తూ కెనడా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఖలిస్థానీ అంశంపై భారత్, కెనడా (India-Canada) మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించిన కెనడా.. ఆ దేశంలోని మన రాయబారిపై బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భారత్.. కెనడాకు గట్టి బదులిచ్చింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ (MEA) వెల్లడించింది.