Airlines under criticism.. – విమర్శలకు గురైన విమాన సంస్థలు..

విమానంలో ప్రయాణం అంటే బోర్డింగ్ నుంచి ల్యాండింగ్ వరకు భద్రత పరంగా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. అయితే తాజాగా విమానంలోని టాయిలెట్‌లో ఓ బాలికకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి బోస్టన్‌కు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు ( American Airlines ) చెందిన విమానం ‘1441’ షార్లెట్ నుంచి బోస్టన్‌కు బయలుదేరింది. ఈ విమానంలో ఓ 14 ఏళ్ల బాలిక టాయిలెట్‌కు వెళ్తుండగా సిబ్బందిలోని ఒక యువకుడు అందులోని సీటు విరిగిపోయిందని, ఫస్ట్ క్లాస్ వాష్‌రూమ్ ఉపయోగించాలని సూచించాడు. దీంతో బాలిక ఆ యువకుడు సూచించిన వాష్‌రూమ్‌కు వెళ్లింది. అయితే టాయిలెట్‌ని ఉపయోగించిన తర్వాత సీటు వెనుక భాగంలో ఫోన్ అతికించి ఉండడాన్ని గమనించింది. వెంటనే ఆమె తన ఫోన్‌తో దాని ఫొటో తీసింది. ఆ బాలిక తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది. ఈ ఘటన తమ కుమార్తెకు, తమకు ఇబ్బందిని కలిగించిందని.. టాయిలెట్‌లో రికార్డు చేయడానికే దానిని అమర్చారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. ‘ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. తమ ప్రయాణికుల, సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఆ యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది.