Azerbaijan and Armenia, – అజర్‌బైజాన్ మరియు అర్మేనియా

అజర్‌బైజాన్, ఆర్మేనియా మధ్య వేర్పాటువాద ప్రాంతం నాగర్నో-కారాబఖ్‌లో రెండు రోజులుగా కొనసాగుతున్న భీకర దాడులకు తాత్కాలికంగా తెర పడింది. మూడు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరడంతో.. యుద్ధ మేఘాలు కమ్ముకొచ్చాయి. ఇలాంటి తరుణంలో రష్యా శాంతి పరిరక్షక దళం మధ్యవర్తిత్వంతో రెండు దేశాల బలగాల మధ్య బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆర్మేనియా మద్దతున్న వేర్పాటువాద నేతలు ఆయుధాలను విడిచిపెట్టనున్నట్లు ప్రకటించగానే, తాము సైనిక దాడులను నిలిపివేసినట్లు అజర్‌బైజాన్ అధికారులు తెలిపారు. సంధి ప్రకటించిన గంట తర్వాత ఆర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యన్ మాట్లాడుతూ.. నాగర్నో-కారాబఖ్‌లో ఘర్షణలు గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. వివాదాస్పద ప్రాంతం నుంచి ఆర్మేనియా తన సైనిక దళాలు, సామగ్రిని ఉపసంహరించుకోవాలి. స్థానిక భద్రతాదళాల నుంచి ఆయుధాలు వెనక్కి తీసుకోవాలి. నాగర్నో-కారాబఖ్‌ను తిరిగి అజర్‌బైజాన్‌లో చేర్చే విషయమై ఇరు పక్షాల మధ్య గురువారం నుంచి చర్చలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం నుంచి కొనసాగిన దాడులతో నాగర్నో-కారాబఖ్‌లోని స్టెపనకెర్ట్ నగరం దద్దరిల్లింది. బాంబు పేలుళ్ల ధాటికి వీధుల్లో వాహనాలు, భవనాల కిటికీలు ధ్వంసయ్యాయి. స్థానికులు భయాందోళనలతో బేస్‌మెంట్లు, బాంబు షెల్టర్లలో తలదాచుకున్నారు. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాడుల్లో 32 మంది మరణించారని, 200 మంది గాయపడ్డారని మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. రష్యా శాంతి పరిరక్షక దళాలు ఇక్కడి నుంచి 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
భౌగోళికంగా అజర్‌బైజాన్‌లో ఉన్న పర్వత ప్రాంతం నాగర్నో- కారాబఖ్‌లో ఆర్మేనియా జాతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత 1994 నుంచి అక్కడ వేర్పాటువాదం ప్రబలింది. ఆర్మేనియా సహకారంతో వేర్పాటువాదులు ఆ ప్రాంతంలో ఆధిపత్యం చలాయిస్తున్నారు. వేర్పాటువాదాన్ని అణచివేసి తిరిగి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి అజర్‌బైజాన్ పోరాటం కొనసాగిస్తోంది. ఇందుకు తుర్కియే మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో ఆ ప్రాంతం ఘర్షణాత్మకంగా మారింది. 1990ల్లో జరిగిన యుద్ధంలో 30 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 2020లో 44 రోజులపాటు జరిగిన యుద్ధంలో 6500 మంది మరణించారు. దీని తర్వాత నాగర్నో- కారాబఖ్‌లో మూడింట ఒక వంతు భాగాన్ని అజర్‌బైజాన్ తిరిగి చేజిక్కించుకుంది. కొన్ని నెలల క్రితం ఆ ప్రాంతాన్ని ఆర్మేనియాతో అనుసంధానం చేసే ప్రధాన మార్గం లచిన్ కారిడార్‌ను మూసివేసింది. దీంతో ఆహారం, ఔషధాల కొరతతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.