RAMOJI Film City – ‘పుష్ప’.. ‘సలార్’ ఆటా పాటా

రామోజీ ఫిల్మ్‌సిటీ భారీ సినిమా చిత్రీకరణలతో సందడిగా ఉంది. ఓ వైపు ‘పుష్ప 2’ మరోవైపు ‘సలార్’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నాయి చిత్ర బృందాలు. పాటన్నా… పుష్ప ఫైట్ అన్నా తగ్గేదేలే అన్నట్టుగా భారీగా ఉండాల్సిందే. ఇక జాతర నేపథ్యంలో సాగే పాటంటే మామూలుగా ఉంటుందా? జాతరంత సందడి కనిపించి తీరాల్సిందే. ‘పుష్ప 2’ కోసం సుమారు వెయ్యిమంది డ్యాన్సర్లపై జాతర నేపథ్యంలో సాగే పాటని తెరకెక్కిస్తున్నారు. గణేశ్ ఆచార్య ఈ పాటకి నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. నెల రోజులుపైగానే సాగే ఈ షెడ్యూల్‌లో ఓ పోరాట ఘట్టం, కొన్ని కీలక సన్నివేశాల్ని కూడా తెరకెక్కించనున్నట్టు సమాచారం. విజయవంతమైన ‘పుష్ప’కి దీటుగా ఉండేలా ‘పుష్ప2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త.
‘సలార్’.. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. సిమ్రత్‌కౌర్ తదితరులపై ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారు. రాజు సుందరం మాస్టర్ నృత్య దర్శకత్వం వహిస్తున్న ఈ పాట అలరించేలా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా, పృథ్వీరాజ్ ప్రతినాయకుడి పాత్రలోనూ నటిస్తున్నారు. డిసెంబరు 22న ఈ సినిమా విడుదల కానుంది.