LEO Movie – విడుదలలో ఎలాంటి మార్పు లేదు

అక్టోబరు 19న ఉదయం 7 గంటల ఆట నుంచే ‘లియో’ సినిమా ప్రదర్శనలు మొదలవుతాయని, విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తమిళ కథానాయకుడు విజయ్ నటించిన ‘లియో’ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. విజయ్‌కి జోడీగా త్రిష నటించారు. దసరాని పురస్కరించుకుని ఈ నెల 19న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు నాగవంశీ. ఆయన మాట్లాడుతూ ‘‘విడుదలకి ముందు తెలుగులో ఓ వేడుకని నిర్వహించాలనుకున్నాం. కానీ కుదరలేదు. పండగ లోపు చిత్రబృందంతో కలిసి వేడుకని నిర్వహిస్తాం. సినిమాకి ముందస్తు బుకింగ్స్ చాలా బాగున్నాయి. ప్రేక్షకుల అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా సినిమా అలరిస్తుంది. లోకేశ్ కనగరాజ్ నిరాశపరచరు. ఈ సినిమా టైటిల్ విషయంలో సమాచార లోపంతో చిన్న సమస్య వచ్చింది. వేరొకరు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారని తెలిసింది. వాళ్లకీ, మాకూ ఎలాంటి నష్టం జరగకుండా త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. విడుదలలో మార్పు ఉండద’’ని చెప్పారు నాగవంశీ. దసరా సినిమాలకి థియేటర్ల సమస్య లేదని చెప్పారు. ‘‘ఏ సినిమాకి కావల్సినన్ని థియేటర్లు ఆ సినిమాకి ఉన్నాయి. ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. మేం నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా తొలి పాట విడుదల ఎప్పుడనేది దసరా సందర్భంగా వెల్లడిస్తామ’’ని నాగవంశీ చెప్పారు.