Balakrishna – 109వ చిత్రం ప్రారంభం

‘భగవంత్ కేసరి’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగారు. ఇది ఆయనకి 109వ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. యాక్షన్ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రబృందం గొడ్డలి, కళ్లద్దాలతో కూడిన ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్… వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ అంటూ ఈ సినిమా ఎంత శక్తిమంతంగా సాగుతుందో సామాజిక మాధ్యమాల ద్వారా చాటి చెప్పారు దర్శకనిర్మాతలు. ‘‘ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన కలయిక ఇది. భారీ స్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.