#ANDHRA ELECTIONS #Elections

TDP-Janasena-BJP: Andhra politics : కూటమిలో అభ్యర్థుల మార్పులపై చర్చలు..

TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన కొన్ని సీట్లలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్‌ బీజేపీకి కేటాయించింది కూటమి. బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణరాజు బరిలో ఉన్నారు.

TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన కొన్ని సీట్లలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్‌ బీజేపీకి కేటాయించింది కూటమి. బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణరాజు బరిలో ఉన్నారు. అయితే టికెట్‌ తనకే ఇవ్వాలని టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పట్టుబడుతున్నారు. న్యాయం కోసం నల్లమిల్లి పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నారాయన. తల్లిని రిక్షాపై కూర్చోబెట్టుకుని కుటుంబ సమేతంగా ప్రచారం చేస్తున్నారు నల్లమిల్లి. ఇంటింటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నల్లమిల్లి కుటుంబాన్ని కాదని బయట వారికి ఏ విధంగా సీటు కేటాయిస్తారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. చంద్రబాబుతో భేటీ సందర్భంగా నల్లమిల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించినట్లు సమాచారం. వైసీపీకి ధీటుగా తాను అయిదేళ్లుగా పార్టీ తరపున పోరాటం చేస్తున్నానని..నియోజకవర్గంలో తనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు లేవని రామకృష్ణారెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. సీటు వ్యవహారంపై కూటమి నేతలతో చర్చిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ అనపర్తి సీటు వదులుకోవాలంటే అదే జిల్లాలో మరో స్థానం కోరుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే దాసరిపల్లి జయ చంద్రరెడ్డిని పార్టీ అధిస్థానం ప్రకటించింది. అయితే ఈ సీటును బీజేపీకి కేటాయించాలని యోచిస్తున్నారు. అయితే రెండు పార్టీల అధిష్టానాలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

కడప ఎంపీ టికెట్‌ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి కేటాయించింది పార్టీ అధిష్టానం. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. కడప ఎంపీ స్థానం బీజేపీకి ఇచ్చి జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్‌ టీడీపీ తీసుకోవడంపై సమాలోచనలు జరుగుతున్నాయి. వాస్తవానికి జమ్మలమడుగు టీడీపీ నుంచి టికెట్‌ ఆశించారు భూపేష్ రెడ్డి. టీడీపీ-బీజేపీ నేతల మధ్య చర్చలు ఫలిస్తే కడప ఎంపీగా బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. జమ్మలమడుగు నుంచి భూపేష్ టీడీపీ క్యాండిడేట్ గా బరిలో నిలిచేలా చర్చలు సాగుతున్నాయి. తాజా ప్రతిపాదనకు బీజేపీ అంగీకరిస్తే మరో ఎంపీ సీటు బీజేపీకి పెరగనుంది. టీడీపీకి మరో అసెంబ్లీ సీటు దక్కనుంది.

రైల్వే కోడూరు, పోలవరం అభ్యర్ధుల మార్పుపై జనసేనలో కసరత్తు జరుగుతోంది. రైల్వే కోడూరులో భాస్కర రావు, పోలవరంలో బాలరాజును జనసేన అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా రైల్వే కోడూరులో ఇండిపెండెంట్ సర్పంచ్ శ్రీధర్ కు టికెట్ కేటాయించే యోచనలో పవన్ ఉన్నారని సమాచారం. పిఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరారు శ్రీధర్‌.

పోలవరంలో కూడా అభ్యర్ధి మార్పుకు జనసేన కసరత్తు చేస్తోంది. టీడీపీ నుంచి పోలవరం సీట్ కోసం బోరగం శ్రీనివాస్ పోటీపడుతున్నారు. టికెట్ ఇస్తే పార్టీ మారటానికి సిద్దంగా ఉన్నారు టీడీపి నేత సూర్య చంద్రరావు. దీనిపై జనసేన అధిష్టానం అంతిమ నిర్ణయం తీసుకోలేదు.

అవనిగడ్డలో టీడీపి నేత మండలి బుద్ద ప్రసాద్ కు టికెట్ ఖరారు చేశారు. అయితే టీడీపీ నేతకు టికెట్ ఇవ్వడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. బుద్ధ ప్రసాద్ కు టికెట్ ఇస్తే రాజీనామా చేస్తామని జనసేన నేతలు ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఇక్కడ అసంతృప్తులను బుజ్జగించడం జనసేన అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది.

మే 13న ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులపై చర్చలు జరుగుతుండటంపై మూడు పార్టీల శ్రేణుల్లో అసహనం వ్యక్తమౌతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *