TDP ELECTION 2024 : These are the candidates.. Bless them అభ్యర్థులు వీరే.. ఆశీర్వదించండి

తెలుగుదేశం పార్టీ 13 లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా తెదేపా 17, భాజపా 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా… తెదేపా నాలుగు మినహా మిగతా 13 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
అమరావతి: తెలుగుదేశం పార్టీ 13 లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా తెదేపా 17, భాజపా 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా… తెదేపా నాలుగు మినహా మిగతా 13 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇంకా కడప, అనంతపురం, ఒంగోలు, రాజంపేట స్థానాలకు ప్రకటించాలి. ఇప్పుడు ప్రకటించిన 13 మందిలో బీసీలు నలుగురు, ఎస్సీలు ముగ్గురు, ఇతర సామాజికవర్గాలకు చెందినవారు ఆరుగురు ఉన్నారు. ఒక మహిళా అభ్యర్థి ఉన్నారు. ‘‘రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరాం. లోక్‌సభలో బలమైన గళం వినిపిస్తూ రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే తెదేపా అభ్యర్థులుగా నిలబెడుతున్నాం. 13 మంది లోక్‌సభ అభ్యర్థులతో పాటు, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నాం. ఆశీర్వదించండి’’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ప్రజల్ని కోరారు. తెదేపా లోక్‌సభ అభ్యర్థుల్లో ఇద్దరు సిటింగ్ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. 8 మంది తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేస్తున్నవారూ కొందరున్నారు.
ప్రకటించాల్సిన స్థానాలు ఇవే
కడపలో వై.ఎస్.వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత పోటీ చేస్తే… పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. ఒంగోలు నుంచి సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని బరిలో దించాలా? ఆయన కుమారుడు రాఘవరెడ్డితో పోటీ చేయించాలా? అన్న సందిగ్ధత కొనసాగుతుండడంతో అక్కడా అభ్యర్థిని ప్రకటించలేదు. పొత్తులో భాగంగా విజయనగరం లోక్‌సభ టికెట్ భాజపాకు ఇవ్వాలని మొదట నిర్ణయించారు. తాజాగా దాని బదులు రాజంపేట స్థానం కేటాయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే రాజంపేటకూ అభ్యర్థిని ప్రకటించలేదు. అనంతపురం స్థానానికి జేసీ పవన్‌తో పాటు, ఇద్దరు ముగ్గురు బీసీ నాయకుల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
విధేయతకు పెద్దపీట
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో విధేయతకు పార్టీ పెద్దపీట వేసింది. యువతకు ప్రాధాన్యమిచ్చింది. శ్రీకాకుళం నుంచి అందరూ ఊహిస్తున్నట్టే సిటింగ్ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడికి మూడోసారి టికెట్ ఇచ్చారు. రోడ్డుప్రమాదంలో ఎర్రన్నాయుడు మరణించాక… ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు 2014, 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి వరుసగా గెలుపొందారు. ఇప్పుడు మూడోసారి ఎన్నికల బరిలో తలపడుతున్నారు.
- విశాఖ నుంచి పోటీచేస్తున్న ఎం.భరత్ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు. సినీనటుడు బాలకృష్ణకు అల్లుడు. అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మూర్తి దుర్మరణం చెందడంతో ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన భరత్ 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీచేసి కేవలం 4,414 ఓట్ల తేడాతో ఓడడంతో, ఇప్పుడు పార్టీ ఆయనకు మళ్లీ అవకాశమిచ్చింది.
- అమలాపురం నుంచి పోటీచేస్తున్న గంటి హరీష్ మాథుర్ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన బాలయోగి కుమారుడు. పార్టీకి, కోనసీమకు బాలయోగి చేసిన సేవలకు గుర్తింపుగా 2019 ఎన్నికల్లో అమలాపురం లోక్‌సభ టికెట్ హరీష్‌కి తెదేపా ఇచ్చింది. అప్పుడు ఓడిపోయినా… ఈసారి మళ్లీ అవకాశమిచ్చింది.
- గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు తెదేపా ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో… విద్యావంతుడు, ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్‌ను పార్టీ బరిలోకి దించింది.
- నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి ఎంపీగా గెలిచిన ఆయన… వైకాపా ప్రభుత్వ అరాచక, ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఇటీవలే తెదేపాలో చేరారు. ఆయనను నరసరావుపేట నుంచే పోటీ చేయించాలని తెదేపా నిర్ణయించింది.
- బాపట్ల నుంచి పోటీచేస్తున్న టి.కృష్ణప్రసాద్ విశ్రాంత ఐపీఎస్ అధికారి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌కు వెళ్లిన ఆయన డీజీపీ హోదాలో పదవీవిరమణ చేశారు. ఆయన అనంతపురం జిల్లాకు చెందిన మాజీమంత్రి, సీనియర్ నేత శమంతకమణి అల్లుడు.
- చిత్తూరు అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మాజీ ఐఆర్‌ఎస్ అధికారి. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన బాపట్ల టికెట్ ఆశించారు. కానీ చిత్తూరులో గట్టి అభ్యర్థి అవుతారన్న ఉద్దేశంతో చంద్రబాబు అక్కడ అవకాశమిచ్చారు.
- కర్నూలు అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అయిదేళ్లు పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో 2000లో తెదేపాలో చేరి… 2001లో ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచారు.
- నంద్యాల అభ్యర్థి బైరెడ్డి శబరి.. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె. వైద్యురాలిగా పనిచేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్న ఆమె… తాత, మాజీ మంత్రి బైరెడ్డి శేషశయనారెడ్డి, తండ్రి రాజశేఖర్‌రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లో ప్రవేశించారు. రాజశేఖర్‌రెడ్డి పదేళ్లుగా రాయలసీమ సమస్యలపై ఉద్యమిస్తున్నారు. శబరి కూడా తండ్రి బాటలో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఆమె భాజపాలో చేరి ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగానూ పనిచేశారు. ఇటీవలే భాజపాకు రాజీనామా చేసి తెదేపాలోకి చేరారు.
- హిందూపురం అభ్యర్థి బీకే పార్థసారథి సీనియర్ నాయకుడు. 1999లో ఎంపీగా గెలిచారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఎన్నికల బరిలో తండ్రీకొడుకులు… భార్యాభర్తలు
- ఏలూరు లోక్‌సభ స్థానంలో పోటీచేస్తున్న పుట్టా మహేష్ యాదవ్… తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు. ఆయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్ జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. మహేష్ యాదవ్‌కు నరసరావుపేట టికెట్ ఇస్తారని కొన్ని నెలల క్రితం ప్రచారం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన పేరు వినిపించలేదు. ఏలూరు నుంచి బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దించాలన్న ఉద్దేశంతో మహేష్ యాదవ్‌కు పార్టీ అవకాశమిచ్చింది. దాంతో తండ్రీ కొడుకులిద్దరూ ఎన్నికల బరిలో దిగుతున్నట్టయింది. ఆయన మామ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష నేత. యనమల కుమార్తె, మహేష్ యాదవ్ మరదలు దివ్యకు తెదేపా తుని అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుటుంబం నుంచి నలుగురు, యనమల, ఎర్రన్నాయుడి కుటుంబాల నుంచి ముగ్గురి చొప్పున బరిలో దిగుతున్నారు.
- నెల్లూరు లోక్‌సభ స్థానంలో పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. ఆయన ఇటీవలే వైకాపా నుంచి తెదేపాలో చేరారు. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.
అన్నదమ్ముల సవాల్..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో పార్టీకి విధేయంగా పనిచేస్తూ, యువగళం పాదయాత్ర లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించిన కేశినేని శివనాథ్‌కు (చిన్ని) అందరూ ఊహించినట్టే టికెట్ దక్కింది. ఆయన సోదరుడు, విజయవాడ సిటింగ్ ఎంపీ కేశినేని నాని ఇటీవలే వైకాపాలో చేరారు. ఈ ఎన్నికల్లో వైకాపా విజయవాడ లోక్‌సభ అభ్యర్థి ఆయనే. ఇక్కడ అన్నదమ్ముల పోటీ ఆసక్తికరంగా మారనుంది.