SUNITHA : Come to the discussion.. are you ready? చర్చకు వస్తా.. నువ్వు సిద్ధమా?

‘వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు కాపాడుతున్నారు? అవినాష్ పాత్ర గురించి మరింత సమాచారం బయటకొస్తే కీలకమైన ఇతర వివరాలేవైనా వెలుగు చూస్తాయని జగన్ భయపడుతున్నారా?’ అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు.
ఈనాడు, అమరావతి: ‘వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు కాపాడుతున్నారు? అవినాష్ పాత్ర గురించి మరింత సమాచారం బయటకొస్తే కీలకమైన ఇతర వివరాలేవైనా వెలుగు చూస్తాయని జగన్ భయపడుతున్నారా?’ అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. ఆయన ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. వివేకాను చంపిన వారెవరో దేవుడికి, కడప ప్రజలకు తెలుసంటూ ఇటీవల వ్యాఖ్యానించిన జగన్‌కు కూడా ఎవరు చంపించారో తెలిసే ఉంటుంది కదా! ఆ విషయం ఆయన ఎందుకు బయటపెట్టట్లేదని నిలదీశారు. షర్మిలను కడప లోక్‌సభ అభ్యర్థిగా నిలబెట్టాలని వివేకా భావించటం వల్లే ఆయన్ను లేకుండా చేశారా? తదితర విషయాలన్నీ బయటకు రావాలని డిమాండు చేశారు. అవినాష్‌ను వెనకేసుకొస్తూ అసెంబ్లీలో మాట్లాడటం మినహా అయిదేళ్లలో ఒక్కసారి కూడా వివేకా హత్య గురించి మాట్లాడని జగన్.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు దాన్ని ప్రస్తావించటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వివేకాను చంపేశాక గత ఎన్నికల్లో దాన్ని రాజకీయాల కోసం వాడుకున్నారని, మళ్లీ ఎన్నికలు వచ్చినందున అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు చోటు ఉండకూడదని అన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్ద మంగళవారం సునీత విలేకరులతో మాట్లాడారు.
వైకాపా మళ్లీ అధికారంలోకి రాకూడదు
‘రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగి ఉంది. దాన్నుంచి బయటకు వస్తే తప్ప మనకు పురోగతి లేదు. నేను రాజకీయ నాయకురాలిని కాదు. తప్పు జరిగింది కాబట్టే ఇప్పుడు బయటకొచ్చి వాటి గురించి మాట్లాడుతున్నా. మళ్లీ వైకాపా ప్రభుత్వమే అధికారంలోకి వస్తే వ్యక్తిగతంగా నాకే కాదు.. మన రాష్ట్రానికీ ఏ మాత్రం మంచిది కాదు. ఈ ప్రభుత్వం రాకుండా చేయటమే నా లక్ష్యం. మన రాష్ట్రం బాగుపడాలి. పారిశ్రామికాభివృద్ధి జరగాలి. షర్మిల నా చెల్లెలు. ఈ ప్రభుత్వం గద్దె దిగాలనేదే మా ఇద్దరి లక్ష్యం. దాన్ని సాధించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాం. కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న షర్మిలను అభినందిస్తున్నా. గత ఎన్నికల్లో ఆమెను అక్కడినుంచి ఎంపీగా పోటీ చేయించటానికి మా నాన్న శాయశక్తులా ప్రయత్నించారు. ఆ క్రమంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఆమె ముందుకొచ్చి పోటీ చేస్తుండటం భావోద్వేగపరంగా నాకు చాలా ముఖ్యమైనది. సంఘీభావం చెప్పేందుకు ఇడుపులపాయకు వెళ్దామనుకున్నప్పటికీ కోర్టులో కేసు ఉండటం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది.
నేరగాళ్లు చట్టసభల్లో ఉండకూడదు…
అవినాష్, జగన్‌ను ఓడించాలి. వైకాపా మళ్లీ అధికారంలోకి రాకూడదు. వివేకా హత్య కేసులో శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులవుతారు. అసలు కేసే విచారణకు రానీయకుండా జాప్యం చేస్తుంటే దోషులకు శిక్ష ఎప్పుడు పడుతుంది? ఇది వ్యవస్థలతో ఆడుకోవటం కాదా? నేరగాళ్లు మళ్లీ మళ్లీ పోటీ చేస్తూ ఎన్నికల్లో గెలుస్తుంటే వారు స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకుంటారు. అందుకే నేరగాళ్లు చట్టసభల్లో ఉండకూడదు.
అందుకే అంత కిరాతకంగా హతమార్చారా?
జగన్ జైల్లో ఉన్నప్పుడు 2012లో జరిగిన ఉపఎన్నికల్లో 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి వైకాపా పోటీ చేస్తే.. షర్మిలే కష్టపడి ప్రచారం చేసి 15 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని గెలిపించుకున్నారు. ప్రజాప్రస్థానం పేరుతో ఎండనక, వాననక నెలల తరబడి ఇంట్లో పిల్లలను వదిలేసి పర్యటిస్తూ వైకాపాను నిలబెట్టారు. ఇది జగన్ ఎలా మరిచిపోయారు? అంత కష్టపడి పార్టీని కాపాడితే ఆమె ఇంకా శక్తిమంతురాలు అవుతారేమోనని భయపడి పక్కన పెట్టేశారు. అయినా ఆమె మౌనంగా ఉంటూ 2014, 2019 ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేశారు. ఇవన్నీ గ్రహించే మా నాన్న ఆమెను కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయించాలని భావించారు. అందుకే నాన్నను లేకుండా చేశారా? ఇవన్నీ బయటకు రావాలి?
గత ఎన్నికలప్పుడు నన్ను తోలుబొమ్మలా జగన్ ఆడించారు..
మా నాన్నను హతమార్చాక గత ఎన్నికల సమయంలో నన్ను తోలుబొమ్మలా ఆడించారు. ఎన్నికల సంఘం వద్దకు వెళ్లినప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేయటం, హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టించి అవినాష్ గురించి మంచిగా చెప్పించడం వంటివి నాతో చేయించారు. అంతా జగన్ చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన్ను అంత గుడ్డిగా నమ్మా. వాస్తవాలు గ్రహించి నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటున్నా. అలాంటిది నేను, షర్మిల ఎవరి ట్రాప్‌లోనో పడ్డామంటూ మాట్లాడటం హాస్యాస్పదం. నేనే కాదు.. గత ఎన్నికలప్పుడు ప్రజలు కూడా జగన్, వైకాపా ట్రాప్‌లో పడ్డారు. ఎవరినైనా ఒకసారి మోసం చేయగలరేమో కానీ పదేపదే చేయలేరు. ప్రజలు తెలివైనవారు కాబట్టి వారి పిల్లల క్షేమం, భవిష్యత్తు కోసం వాస్తవాలు చూస్తారనే నమ్మకముంది. భావోద్వేగాలతో జగన్ మాట్లాడినంత మాత్రాన ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు.
సాక్షి ఛానెల్‌కే వస్తా… జగన్ నాతో చర్చకు సిద్ధమా?
నేను లేవనెత్తిన అంశాలపై జగన్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. జగన్.. మీరు నాతో నేరుగా మాట్లాడతానంటే మీ సాక్షి ఛానెల్‌కే వచ్చి నీతో చర్చిస్తా. నిజానిజాలు అప్పుడు బయటకొస్తాయి. వాటి ఆధారంగా ప్రజలూ అర్థం చేసుకుంటారు. కడప, హైదరాబాద్‌ల్లో ప్రెస్‌మీట్లు పెట్టి నేను లేవనెత్తిన అంశాలకు ఒక అన్నగా సమాధానం చెప్పకపోయినా ఫరవాలేదు.. ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేయటానికి ప్రయత్నిస్తే నన్ను నిలువరించేందుకు చాలా ప్రయత్నించారు. జగన్‌తో మాట్లాడతానంటే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. మా నాన్న తొలి వర్థంతి కోసం ఆహ్వానించేందుకు వచ్చి కలుస్తానంటే అవసరం లేదని అన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆయన్ను కలిసే సందర్భం రాలేదు. తర్వాత మాట్లాడలేదు. ఆ అవసరమూ నాకు రాలేదు. నా ఉద్యమం నాదైపోయింది. ‘వివేకం’ సినిమాను ఎవరో కానీ చాలా ధైర్యంగా తీశారు. ఆ సినిమా చివరి అరగంట చూస్తే చాలా భయం వేసింది. ఆ సన్నివేశాలు చూడలేక కళ్లు మూసుకున్నా. అందులో చూపించిన దానికంటే వాస్తవంగా ఇంకా క్రూరంగా చంపారు.