TDP: పిన్నెల్లి సోదరుల కంటే కిమ్ బెటర్: తెదేపా పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట తెదేపా పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు.
మంగళగిరి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట తెదేపా పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. అంతు చూస్తామని నన్ను బెదిరించారు. తెదేపా ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నా కుటుంబం పైనా దాడి చేశారు. వాళ్ల అనుచరులు నా పెద్దకుమారుడి పొట్టపై తన్నారు. ప్రాణాలకు తెగించి తెదేపా పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్నా.
వెంకట్రామిరెడ్డిని నా వదిన కాళ్లు పట్టుకుని బతిమాలినా వదల్లేదు. నా కుటుంబంపై ఆయనకు అంత కక్ష ఎందుకు? ఆయనకు భయపడి అధికారులు నోరు మెదపలేదు. నాపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదు. డీఎస్పీ ఉండగానే నాపై దాడికి యత్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం బెదిరించారు. పిన్నెల్లి సోదరుల కంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ బెటర్. నన్ను చంపేంత తప్పు ఏం చేశాను? వైకాపా చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవడమే నేను చేసిన తప్పా’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.