Chandrababu Comments About YSRCP:కౌంటింగ్ రోజున కూడా YSRCP పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం

ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న వైకాపా మూకలు.. కౌంటింగ్ రోజున కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తనకు సమాచారం అందిందని తెదేపా అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో చెప్పారు.
డిజిటల్, అమరావతి: ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న వైకాపా మూకలు.. కౌంటింగ్ రోజున కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తనకు సమాచారం అందిందని తెదేపా అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో చెప్పారు. పోలింగ్ రోజు, అనంతరం మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, తాడిపత్రి సహా పలు నియోజకవర్గాల్లో చోటుచేసుకొన్న అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్ ముందురోజు నుంచే అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఈసీ, డీజీపీకి లేఖలు రాయాలన్నారు. గతంలో కంటే ఈసారి భారీగా పోస్టల్ బ్యాలట్ ఓట్లు పడటం, అవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనే భయంతోనే వైకాపా నేతలు వాటి కౌంటింగ్ ప్రక్రియ విషయంలో సీఈఓ, తెదేపాలపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలట్ ఓట్లను నిరర్థకం చేయడానికి కుట్ర పన్నుతున్నారని.. వీటిని సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి 200 మంది ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు 31న మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో, నియోజకవర్గాల్లో విధులు నిర్వహించనున్న కౌంటింగ్ ఏజెంట్లకు జోన్లవారీగా జూన్ 1న ఆయా ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.
కీలకం కానున్న పోస్టల్ బ్యాలట్
‘ఎన్నికల వరకు పడ్డ కష్టం ఒక ఎత్తు.. కౌంటింగ్ రోజు మరో ఎత్తు. ఈవీఎంలో నమోదైన ఓట్ల లెక్కింపులో పెద్ద సమస్యలు ఉండవు. పోస్టల్ బ్యాలట్ ఓట్ల కౌంటింగ్ అత్యంత ముఖ్యమైంది. ఈ ఎన్నికల్లో 5.40 లక్షల పోస్టల్ బ్యాలట్ ఓట్లు నమోదయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే రెండున్నర లక్షలు అధికంగా పడ్డాయి. సగటున ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేలకు పైగా, లోక్‌సభ నియోజకవర్గంలో 22 వేల వరకు పోస్టల్ బ్యాలట్ల ఓట్లు నమోదయ్యాయి. గెలుపోటముల నిర్ణయంలో ఇవి కీలకం. అందుకే వీటిని నిరర్థకం చేసేందుకు వైకాపా వాళ్లు కుట్రలు చేస్తున్నారు. ఈసీ ఆదేశాలకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి 500 పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉన్నా యంత్రాంగం ఆ మేరకు చేయడం లేదని నేతలు ఆయనకు చెప్పారు. బుధవారం మధ్యాహ్నానికి మొత్తం 1,081 టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా 633 మాత్రమే చేశారన్నారు. దీనిపై సీఈఓను కలవాలని చంద్రబాబు నేతలకు సూచించారు.
సరిపడా పరిశీలకుల్ని నియమించక పోవడంపై అసంతృప్తి
175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేవలం 122 మంది కౌంటింగ్ పరిశీలకుల్నే ఈసీ నియమించడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలకు కలిపి ఒకే కౌంటింగ్ పరిశీలకుణ్ని నియమించడమేంటని ప్రశ్నించారు. ‘ఓట్ల లెక్కింపులో ఎలాంటి తప్పులకూ ఆస్కారం లేకుండా, గెలిచిన అభ్యర్థి ప్రకటనలో కీలకంగా వ్యవహరించే కౌంటింగ్ పరిశీలకుల్ని తక్కువ సంఖ్యలో నియమించడం తగదు. 94 నియోజకవర్గాలకు 41 మందినే నియమించారు. అంటే ఒక్కో పరిశీలకుడు రెండు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో లెక్కింపును పరిశీలించాల్సి ఉంటుంది. వీటిలో కడప, పులివెందుల, కమలాపురం, తాడిపత్రి, వినుకొండ, బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు లాంటి పలు కీలక నియోజకవర్గాలున్నాయి. వీటిని ఈసీ దృష్టికి తీసుకువెళ్లాలి’ అని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.