#ANDHRA ELECTIONS #Elections

AP CID CASE ON CHANDRA BABU: చంద్రబాబుపై మరో కొత్తకేసు

రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది.

2020 నాటి ఎసైన్డ్‌ భూముల కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ అభియోగపత్రం
దానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఆదేశం

అమరావతి: రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. దానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. ఎసైన్డ్‌ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ యల్లమాటి ప్రసాద్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో 2020 ఫిబ్రవరి 27న పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఇదే వ్యవహారంపై నల్లూరు రవికిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2020 మార్చి 3న మరోకేసు నమోదుచేసి, పలువురిని నిందితులుగా పేర్కొంది. 2022లో మాజీమంత్రి నారాయణను నిందితుల జాబితాలో చేర్చింది. సీఐడీ కేసుల్ని రద్దు చేయాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నిబంధనల్ని పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

క్రైం నంబర్లు 14/2020, 15/2020 కేసులకు సంబంధించి సీఐడీ.. ఏసీబీ కోర్టులో సోమవారం అభియోగపత్రం దాఖలు చేసింది. క్రైం నం. 14/2020లో చంద్రబాబును 40వ నిందితుడిగా పేర్కొంది. మరో 22 మందిని నిందితులుగా చేర్చాలని ఏసీబీ కోర్టులో సీఐడీ డీఎస్పీ మెమో దాఖలుచేశారు. చంద్రబాబుతోపాటు, నారాయణ, తుళ్లూరు మండలం అప్పటి తహశీల్దార్‌ సుధీర్‌బాబు, రామకృష్ణ హౌజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ కేపీవీ అంజనీకుమార్‌ను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.

ఆరోపణలు ఇవే…

ఎసైన్డ్‌ భూములకు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఎసైనీదారులను భయాందోళనలకు గురిచేసి అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఇతర మంత్రులు, వారి బినామీలు.. తక్కువ ధరకు భూములు కొన్నట్లు అభియోగపత్రంలో సీఐడీ ఆరోపించింది. కొనుగోలు చేసిన ఎసైన్డ్‌ భూములకు భూసమీకరణ ప్రయోజనాలు పొందేందుకు అధికారులను ఒత్తిడి చేసి, నిబంధనలకు విరుద్ధంగా జీవో 41 జారీ చేయించారని తెలిపింది.

  • భూముల కొనుగోలుకు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కేపీవీ అంజనీకుమార్‌, గుమ్మడి సురేశ్‌, కొల్లి శివరామ్‌, మంత్రుల కుటుంబసభ్యులు బినామీలుగా వ్యవహరించారంది. మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ను ఒత్తిడి చేసి భూములను రిజిస్టర్‌ చేయించారని తెలిపింది. నారాయణ, ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, కంపెనీల నుంచి రామకృష్ణ హౌజింగ్‌ సొసైటీ, ఇతర రియల్‌ ఎస్టేట్‌ సంస్థల మధ్యవర్తులకు రూ.16.5 కోట్ల నిధులు వెళ్లాయంది. ఆ సొమ్మును ఎసైన్డ్‌ రైతులకు చెల్లించి నారాయణ బినామీలు అక్రమంగా విక్రయ దస్తావేజులు రాయించుకున్నారని పేర్కొంది.
  • రెవెన్యూ రికార్డుల్ని పరిశీలిస్తే… వాస్తవ ఎసైనీదారుల స్థానంలో 945 ఎకరాల్లో భూసమీకరణ పథకం కింద ప్రయోజనం పొందేందుకు 1,336 మంది దరఖాస్తు చేసుకున్నారని సీఐడీ ఆరోపించింది. బినామీగా వ్యవహరించిన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలంటూ వేసిన పిటిషన్‌ ఏసీబీ కోర్టులో పరిశీలనలో ఉందని వెల్లడించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *