ANDHRA ELECTIONS : This is the situation of AP opposition alliance… ఏపీ ప్రతిపక్ష కూటమి పరిస్థితి ఇదీ..

ఏపీ ప్రతిపక్ష కూటమిలో మూడు సీట్లు… ఆరు ఆందోళనలు అన్నట్లుగా నడుస్తోంది. సీనియర్ నాయకులు తమకు టికెట్ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను..
ఏపీ ప్రతిపక్ష కూటమిలో మూడు సీట్లు… ఆరు ఆందోళనలు అన్నట్లుగా నడుస్తోంది. సీనియర్ నాయకులు తమకు టికెట్ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను హెచ్చరిస్తున్నారు. సేమ్ ఇలాంటి సీనే జరిగింది అనపర్తిలో. పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో… మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే సీటు గల్లంతవ్వడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. కట్టప్ప రాజకీయాలు వద్దంటూ నినాదాలు చేశారు. తీవ్ర మనస్తాపానికి గురై ఓ కార్యకర్త ఇంటి పైనుంచే దూకే ప్రయత్నం చేయగా… ఇంకో వ్యక్తి పెట్రోల్ పోలీసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు.
ఇక అధిష్టానం నిర్ణయం మార్చుకుని తనకు సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు నల్లమిల్లి. మరోవైపు కొడుకుకి సీటు రాకపోవడంతో… ఆయన తల్లి సైతం కన్నీటి పర్యంతమయ్యారు. బీజేపీ బద్వేల్ సీటు ఆశించిన పనతల సురేష్‌కు పార్టీ షాకివ్వడంతో… ఆయన తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. విజయవాడలోని పార్టీ ఆఫీసు ఎదుట ఫ్లకార్డులతో బైఠాయించి ఆందోళన చేశారు. ఇటు అనంతపురం జిల్లా ధర్మవరంలోనూ పొత్తు రాజకీయాలు వేడెక్కాయి. పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్‌ను బీజేపీకి కేటాయించడంతో టీడీపీ, జనసేన పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. వరదాపురం సూరి, పరిటాల శ్రీరామ్ అనుచరులు నిరసనకు దిగారు.
ఓవైపు సీటు రాలేదని నేతలు నిప్పులు చెరుగుతుంటే… మరోవైపు సర్ధుబాట్లు చోటుచేసుకున్నారు. మొన్నటివరకు తిరుపతి టికెట్ ఇవ్వలేదంటూ ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సడెన్‌గా కూల్ అయ్యారు. సీటు విషయంలో వెనక్కి తగ్గారామె.. కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తానంటూ శాంతించారు సుగుణమ్మ. కూటమిలో సీట్ల ఫైట్‌పై బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. టికెట్ ఆశించి రాకపోతే ఎవరైనా ఆందోళనకు గురికావడం కామన్ అన్నారు. ఎవరెలా నిరసనకు దిగినా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారామె. మొత్తంగా… సీట్ల పంపకాల విషయం కూటమిలో అగ్గిరాజేస్తోంది. సీటు కావాల్సిందేనని కొందరు పట్టుబట్టి ఆందోళనలకు దిగుతుంటే.. మరికొందరు కాంప్రమైజ్ అయ్యి కూటమి అభ్యర్థినే సమర్థిస్తున్నారు.