మరోసారి ప్రజల ముందుకు వస్తున్నా…

వరంగల్ పశ్చిమ: మరోసారి ప్రజల ముందుకు వస్తున్నానని, ఆదరించాలని స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నానని, సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేస్తూ విధేయుడిగా ఉన్న తనకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి పోటీచేసే అవకాశం కల్పించారన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానన్నారు. కాజీపేటలో ప్రస్తుతమున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా మరో బ్రిడ్జి మంజూరు చేయించానన్నారు. ప్రతి కాలనీలో పార్కుల ఏర్పాటుతోపాటు ఓపెన్ జిమ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చానన్నారు. నగరంలో ప్రత్యేకంగా పెట్ పార్కు, పిల్లల కోసం ప్రత్యేకంగా పార్కు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో నూతన కాలనీలు వెలుస్తూనే ఉంటాయన్నారు. కొత్త కాలనీల్లో ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నానన్నారు. తనకు బీఆర్‌ఎస్ నుంచి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రైతురుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Source:https://www.sakshi.com/telugu-news/hanamkonda/1745790