Nalgonda : వానాకాలం పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంపు అంతంత మాత్రంగానే ఉంది

కేంద్ర ప్రభుత్వ వానాకాలం పంటల మద్దతు ధర పెంపు అంతంత మాత్రంగానే ఉంది. పెరిగిన పెట్టుబడులతో పోల్చితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సేకరించే పంటలకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా లేకపోవడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా సాగయ్యే వరికి ఏ గ్రేడ్ రకానికి రూ.2203 ఇచ్చేలా ఎఫ్‌సీఐని ఆదేశించింది. పత్తి ఏ గ్రేడ్‌కు రూ.7020, బీ గ్రేడ్‌కు రూ.6620కి కొనాలని నిర్ణయించింది. ఈ ధరలు మాత్రం లాభదాయకంగా లేవని కర్షకులు వాపోతున్నారు.
కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే బహిరంగ మార్కెట్‌లోనే పంటలకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ఈ ఏడాది ఆరుతడి పంటల సాగు గణనీయంగా తగ్గింది. ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. దీంతో విపణిలో పంటలకు మంచి డిమాండ్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో పంటల దిగుబడి పడిపోతున్న తరుణంలో కేంద్రం మద్దతు ధరలు పెంచినా రైతులకు ప్రయోజనం చేకూర్చదని రైతు సంఘాలు నాయకులు ఆరోపిస్తున్నారు. మొక్కజొన్న రెండేళ్లుగా మార్కెట్‌లో క్వింటాకు రూ.2200 కొనుగోలు చేస్తుంటే కేంద్రం ఇప్పుడు రూ.2,090 మాత్రమే ఇవ్వడంపై సాగుదారులు పెదవి విరుస్తున్నారు. మిగతా పంటలది దాదాపు అదే పరిస్థితి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 3.04 లక్షలు, నల్గొండ 5.03 లక్షలు, సూర్యాపేటలో 4.30 లక్షల ఎకరాల్లో ప్రస్తుత వానాకాలంలో వరి పంట సాగు చేస్తున్నారు. ప్రతి సీజన్‌లో సుమారుగా 33 లక్షల క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి. 2020-21లో క్వింటా ధర రూ.1960 ఉండగా 2021-2022లో రూ.2,080కు పెంచారు. ఇప్పుడు రూ.2,203 ఖరారు చేశారు. అంటే పెరిగిన రూ.123 ధరతో సీజన్‌కు జిల్లా రైతుకు సుమారుగా రూ.4,059 కోట్ల అదనపు ఆదాయం వచ్చే వీలుంది. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో క్వింటాకు కనీసం రూ.2500 పైచిలుకు ఉంటేనే ప్రయోజనం ఉంటుందని అన్నదాతలు చెబుతున్నారు.