Nagarkurnool – చలితీవ్రత మొదలైంది.

నారాయణపేట:జిల్లాలో చలితీవ్రత మొదలైంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలు వణికిపోతున్నాయి, ఇది ఇలాగే కొనసాగితే నవంబర్, డిసెంబర్ నెలల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారవచ్చు. 22వ తేదీన జిల్లాలో ఎన్నడూ లేనంతగా 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. చల్లని గాలులు రాత్రి ప్రయాణించేవారికి ఇబ్బంది కల్గిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో దట్టమైన అడువులు విస్తరించడంతో చల్లదనం ఆవరించింది. కోటకొండ, దామరగిద్ద, నారాయణపేట సరిహద్దు ప్రాంతాలలో తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. గూడేలు, తండాల్లో ప్రజలు చలి నుంచి రక్షణకు మంటలు వేసుకుంటున్నారు.
రాత్రి 8 గంటల తర్వాత పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, ఆస్తమా ఉన్నవారు, అలర్జీలతో బాధపడే వారు వాతావరణ మార్పుల వల్ల ఇప్పటికే విస్తృతంగా విజృంభిస్తున్న ప్రాణాంతక జ్వరాలపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. తెల్లవారుజామునే మంచులో తిరగకపోవడమే ఉత్తమమని ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ బాలాజీరావు సూచిస్తున్నారు.ఏ మాత్రం తేడా ఉన్నా వైద్యులను సంప్రదించాలన్నారు. శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా చూసుకోవాలన్నారు. ప్రతిరోజూ 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగేలా చూసుకోవాలన్నారు. దుమ్ము వాతావరణంలో తిరగకపోవడమే ఉత్తమమని చెప్పారు.