‘Sadak Bandh’ – ‘సడక్ బంద్’

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిలపక్షం, ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. 29న ‘సడక్ బంద్’కు పిలుపునిచ్చిన ఐకాస.. పక్షం రోజులుగా ప్రచారం చేస్తోంది. దీంతో శుక్రవారం ఉదయమే ఐకాస, అఖిలపక్ష నాయకుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని కొమురవెల్లి ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న నిరసనకారులు మూడు బృందాలుగా విడిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి మూడుచోట్ల రాస్తారోకో చేశారు. ఒక బృందం చేర్యాల పాతబస్టాండు వద్ద, మరోటి కొమురవెల్లి మండలం మర్రిముచ్చాలలో, ఇంకో బృందం ముస్త్యాలలో జాతీయ రహదారిపై బైఠాయించింది. దాదాపు గంటసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు కిలోమీటరు దూరం వాహనాలు నిలిచిపోయాయి. సీఐ సత్యనారాయణరెడ్డి, చేర్యాల, కొమురవెల్లి ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, నాగరాజు సిబ్బందితో మూడు చోట్లకు వెళ్లి నిరసనకారులను వాహనాల్లో చేర్యాల ఠాణాకు తీసుకొచ్చారు. 19 రోజులుగా చేపట్టిన దీక్షల్లో భాగంగా పాతబస్టాండు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పట్టణ రజక సంఘం ప్రతినిధులు కూర్చున్నారు.
- నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని, మరింత ఉద్ధృతంగా మారుతుందని ఐకాస నాయకులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే అధికార పార్టీ నేతలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు వస్తాయన్నారు.