fishery is calling-మత్స్యరంగం పిలుస్తోంది!

నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని మత్స్య సంపదను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వనపర్తి జిల్లా పెబ్బేరులో మత్స్య కళాశాల ను ఏర్పాటు చేసింది. ఇక్కడ చేస్తున్న పరిశోధనలు ఈ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదపడనున్నాయి. తెలంగాణలో ఈ రంగం అభివృద్ధికి స్థానిక కళాశాలలో బోధన, పరిశోధన, విస్తరణ అనే అంశాలపై పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. మత్స్య శాస్త్రంపై భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయనే దిశగా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కళాశాలలో ప్రవేశానికి హైదరాబాద్‌లోని అచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. విద్యార్థులకు బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (బీఎఫ్‌ఎస్సీ) కోర్సులో అవకాశం కల్పిస్తారు.
తెలంగాణలో తొలి కళాశాల : రాష్ట్రంలోనే తొలి మత్స్య కళాశాల పెబ్బేరులో 2017లో ప్రారంభమైంది. అప్పట్లో 27.28 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం 65.20 ఎకరాలకు విస్తరించింది. పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న ఈ కళాశాలలో విద్యార్థుకు మత్స్యశాస్త్రంపై బోధన, కార్యకలపాలపై పరిశోధనలను విస్తరణ చేయడంపై బోధిస్తున్నారు. మత్స్య రైతులు, మత్స్యకారులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణలతో పాటు ఆ రంగంలో పరిశోధనల ద్వారా రాష్ట్రం, దేశ అభివృద్ధికి తోడ్పడేలా విద్యార్థును తీర్చిదిద్దుతున్నారు. ఈ కోర్సులో చేరడానికి ఇంటర్‌లో బైపీసీ చదివి, ఎంసెట్ రాయాలి. ర్యాంకు ఆధారంగా కౌన్సిలింగ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సులో ఏటా 25 మందికే అవకాశం కల్పిస్తారు.
ఏడు విభాగాలు..: అక్వా కల్చర్, జలచర జీవుల ఆరోగ్య యజమాన్యం, జలచర జీవుల వాతావరణ యజమాన్యం, మత్స్య సంపద యజమాన్యం, ప్రాసెసింగ్ టెక్నాలజీ, మత్స్య సాంకేతిక విభాగం, మత్స్య విస్తరణ ఆర్థిక, గణాంక విభాగాలు ఉన్నాయి. వీటిలో చేప గుడ్డు దశ నుంచి చేపలు పట్టి విక్రయించే వరకు శిక్షణ ఉంటుంది. చేపల చెరువుల ఏర్పాటు చేసుకోవడం, వలలు అల్లడం, చేప పిల్లలను వదలడం తదితర వంటివి పూర్తిగా అవగాహన కల్పిచడంలో ఈ కోర్సులు దోహదపడతాయి. బోధన 60 శాతం, పరిశోధన 20, విస్తరణ 10, మిగతా 10 శాతం సామాజికంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మత్స్య శాఖ అభివృద్ధి అధికారులుగా, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్, ఇతర రంగాల్లో టెక్నికల్ అధికారులతో పాటు స్వయం ఉపాధితో పాటు ప్రైవేటు రంగాల్లో అవకాశాలు ఉంటాయి.