PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు అక్టోబర్ 1న పాలమూరుకు వస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ పట్టణం అమిస్తాపూర్‌లో జరుగుతున్న సభా ఏర్పాట్లను శుక్రవారం ఆమె ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం పనులు పెద్దఎత్తున సాగుతున్నాయన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్మించిన జాతీయ రహదారులు, దేవరకద్ర నుంచి జక్లేర్ మీదుగా నిర్మించిన కృష్ణా రైల్వేలైన్, ఇంటింటికి పైపులైన్‌తో ఇచ్చే వంటగ్యాస్‌ను ప్రధాని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇంటింటికి వంటగ్యాస్ అందించేందుకు రాష్ట్రంలో 232 కి.మీ.ల మేర పైపులైన్ నిర్మించగా పాలమూరు జిల్లాలోనే 130 కి.మీ.లు ఉందన్నారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పాండురంగారెడ్డి పాల్గొన్నారు.