#Khammam District

On 17th they should flock to Vijayabheri like a fair – 17న విజయభేరికి జాతరలా తరలి రావాలి

ఖమ్మం: హైదరాబాద్‌ వేదికగా తొలిసారి ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలు చరిత్రాత్మకం కానున్నాయని, చివరి రోజు రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరి సభకు ప్రజలు జాతరలా తరలిరావాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సభను విజయవంతం చేయడానికి నేతలు, కేడర్‌ ప్రజాక్షేత్రంలోకి కదలి వెళ్లాలని సూచించారు.

సభలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు డిక్లరేషన్లు పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ప్రకటిస్తారని, ఇవి ప్రజల భవిష్యత్‌ను మార్చే పునాదిరాళ్లు అవుతాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం పార్లమెంట్‌ ఇన్‌చార్జి, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆరీష్‌ నసీంఖాన్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెలంగాణలో లూటీ చేసి.. మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు.  

సన్నాహకంలో ఆగ్రహావేశాలు 
ఖమ్మం పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశానికి ఏడు నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారితోపాటు వారి అనుచరులు హాజరయ్యారు. తమ నేతకే టికెట్‌ ఇవ్వాలని, పాత నేతలను కాదని కొత్త వారికి ఇస్తే సహించేది లేదని నినాదాలు చేశారు. మాజీ ఎంపీ వీహెచ్‌ మాట్లాడుతుండగా నినాదాలు ఒక్కసారిగా మిన్నంటాయి.

వేదికపై కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండగానే కార్యకర్తలు ఆందోళనకు దిగగా… భట్టి, పొంగులేటి వారిని వారించడంతో గొడవ సద్దుమణిగింది. మొత్తంగా ఈ సన్నాహక సమావేశం చివరి వరకు రసాభాసగా సాగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *