బరిలో నిలిచే ప్రత్యర్థులెవరు?

బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ ఉమ్మడి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార భారాస పార్టీ నాలుగు జిల్లాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిచేవారి పేర్లను ఖరారు చేసింది.
ఈనాడు, కరీంనగర్: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ ఉమ్మడి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార భారాస పార్టీ నాలుగు జిల్లాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిచేవారి పేర్లను ఖరారు చేసింది. దీంతో ప్రత్యర్థి పార్టీలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపాల వ్యూహాలేంటి అన్న చర్చ జరుగుతుండగా.. ఆ పార్టీలకు చెందిన ఆశావహ నాయకులు మాత్రం పలు సమీకరణాల ప్రకారం టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా మరికొందరు దరఖాస్తుకు సిద్ధమవుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులకు బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దింపాలనే విధంగా ప్రత్యర్థి పార్టీల అధిష్ఠానాలు సర్వేలతోపాటు ఇతర సమీకరణాలపై దృష్టిసారిస్తున్నాయి.