Karimnagar : పోలింగ్ బూత్‌ల పెంపు..

గంటల తరబడి ఓటింగ్ కోసం వరుసలో నిలబడే కష్టాలను తొలగించే దిశగా యంత్రాంగం శ్రమిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల దిశగా అవసరమైన ఏర్పాట్లలో అధికారులు తలమునకలవుతోంది.. ఇందులో అన్నింటికన్నా ముఖ్యంగా పోలింగ్ బూత్‌లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒక్కో కేంద్రం వద్ద ఓటు వేసేందుకు పదుల సంఖ్యలో ఓటర్లు వరుసగా బారులు తీరి ఇక్కట్లను ఎదుర్కొన్న సందర్భాలను గుర్తించి.. ఈ సారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా గ్రామాల వారీగా ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ బూత్‌లను పెంచుతున్నారు. గతంలో కొన్ని గ్రామాల్లో ఒక్కో చోట 1100 నుంచి 1500 మంది తమ హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి కేంద్రంలో సగటున 500-700 ఓటర్లు ఉండేలా పోలింగ్ బూత్‌ల సంఖ్యను పెంచుతున్నారు. మరోవైపు ఒకే ఇంటిలోని కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ బూత్‌కు వచ్చే వెసులుబాటు కల్పించబోతున్నారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పటి వరకు ఆయా అసెంబ్లీ స్థానాల పరిధిలో గణనీయంగా వీటిని పెంచేశారు. మొత్తంగా 13 నియోజకవర్గాల పరిధిలో 296 కొత్త పోలింగ్ బూత్‌లు ఏర్పాటయ్యాయి.
ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గణనీయంగా ఓట్లు పెరుగుతున్నాయి. వచ్చే నెల 4వ తేదీన తుది ఓటరు ముసాయిదాను వెలువరించే అవకాశం ఉండటంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. కొత్తగా యువ ఓటర్లు జాబితాలోకి రానున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. గత శాసనసభ ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాల్లో కలిపి 27,88,085 ఓట్లుంటే ఇప్పుడు వాటి సంఖ్య 30,29,132కి చేరింది. దాదాపుగా 2,41,047 మంది పెరిగారు. దాదాపుగా ఒక నియోజకవర్గం పరిధిలో ఉన్న ఓట్లకు సమానంగా ఈ సంఖ్య పెరగడం గమనార్హం. అత్యధికంగా కరీంనగర్ నియోజకవర్గంలో 3.28 లక్షల ఓటర్లు ఉండగా అతి తక్కువగా రామగుండంలో 2.07 లక్షల మంది వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని పొందారు. పెరిగిన ఓట్ల సంఖ్యకు తగినట్లుగా 296 పోలింగ్ బూత్‌లు పెరిగాయి. ఇంకా ఆయా నియోజకవర్గాల్లో పెరిగే కొత్త ఓటర్ల ఆధారంగా మరికొన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశముంది.