Women’s Reservation Bill In The Parliament – పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు

హైదరాబాద్: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడంతో ఆమోదం పొందడం లాంఛనమేనన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో.. వీలైతే 2028 ఎన్నికలకు లేదా ఆ తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. అయినప్పటికీ.. వివిధ రంగాల్లోని మహిళలు.. ముఖ్యంగా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్లుగా ఉన్న వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లుండగా, అంతకంటే ఎక్కువ సంఖ్యలో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. అయినప్పటికీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి వారికి అవకాశాలు అందడం లేదు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే తప్పనిసరిగా టికెట్లు ఇవ్వాలి కాబట్టి ఎక్కువమంది మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఒక్కరే..
గ్రేటర్ నగర పరిధిలో 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తప్ప మరో మహిళా ఎమ్మెల్యే లేరు. రిజర్వేషన్లు అమల్లోకి వస్తే వీరి సంఖ్య పెరగనుంది. జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ముగిశాకే ఈ రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలనే పరిగణనలోకి తీసుకున్నా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే 39 టికెట్లు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. జనగణన అనంతరం డీలిమిటేషన్‌తో అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ఆమేరకు ఎక్కువమంది మహిళలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం లభించనుంది. అందులోనూ గ్రేటర్ పరిసరాల్లోని వారికి మిగతా వారికంటే ఎక్కువ అవకాశాలు లభించే వీలుంది. ఈ నేపథ్యంలో నగరంలోని మహిళా కార్పొరేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెట్టెక్కనున్న కార్పొరేటర్లు
ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్లుగా 75 మందికి పైగా మహిళలున్నప్పటికీ, ఎమ్మెల్యేలుగా అవకాశాలు లభిస్తున్న వారంటూ లేరు. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్ లాస్య నందితకు టికెట్ లభించింది సాయన్న ఖాతాకిందనే కావడం తెలిసిందే. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక ఎక్కువమంది మహిళా కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం లభించనుంది.