Thugs Took A Six-Month-Old Child – ఆరు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు…..నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి నుంచి ఆరు నెలల చిన్నారి ఫైజల్ ఖాన్‌ను ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తప్పి పోయిన బాలుడి తల్లి భోజనం కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై బాధితురాలు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, బాలుడు ఫైజల్ ఖాన్ మిస్సయిన ట్రీట్‌మెంట్ వార్డులో సీసీ కెమెరా లేకపోవడం పోలీసుల దర్యాప్తునకు కొంచెం ఆటంకంగా మారింది. కాగా, బాలుడి తల్లి నుంచి ఓ మహిళ ఫైజల్‌ఖాన్‌ను తీసుకుని ఎత్తుకున్నదని, ఆమె భోజనానికి వెళ్లి తిరిగొచ్చే సరికి బాలుడితో సహా సదరు మహిళ పరారయ్యిందని తెలుస్తున్నది.
ఘటనకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. తన బిడ్డకు
అనారోగ్యంగా ఉండటంతో గురువారం ఆస్పత్రికి తీసుకొచ్చామని, రాత్రి అకస్మాత్తుగా తన కొడుకు కనిపించకుండా పోయాడని బాలుడి తండ్రి, గండిపేట ప్రాంతానికి చెందిన సల్మాన్ ఖాన్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.