Sand Thieves-పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో

పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణంలో పర్యవేక్షించాల్సిన అధికారే కాసుల కక్కుర్తితో గుత్తేదారుతో కలసి వందల టన్నుల ఇసుకను బహిరంగ మార్కెట్‌లో విక్రయించినట్టు బయటపడింది.
పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణంలో పర్యవేక్షించాల్సిన అధికారే కాసుల కక్కుర్తితో గుత్తేదారుతో కలసి వందల టన్నుల ఇసుకను బహిరంగ మార్కెట్‌లో విక్రయించినట్టు బయటపడింది. వివరాలు.. బంజారాహిల్స్‌లో తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించింది. దీనికోసం 24,000 క్యూబిక్ మీటర్లు, సెంటర్ ఫర్ దళిత్ ఆడిటోరియంకు 16,000 క్యూబిక్ మీటర్ల నది ఇసుకను తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్‌ఎండీసీ) కేటాయించింది. ఒక్క క్యూబిక్ మీటర్‌కు రూ.600 చొప్పున చెల్లించేలా ఈఈ ఎస్.అశోక్ వినతిపత్రంతో టీఎస్‌ఎండీసీ డైరెక్టర్ కేటాయింపులు జరిపారు. 2016లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసిన ఎస్.అశోక్ తిరిగి అదే హోదాలో విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. నది నుంచి ఇసుక తరలించేందుకు ఈఈ అశోక్ అనధికారికంగా మధుర శాండ్ సప్లయిర్స్ నిర్వాహకుడు రాహుల్ అలియాస్ రఘు ఇస్లావత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇసుక రీచ్‌లో మాజీ మంత్రి పేరిట ఉన్న లారీ నంబర్లతో నిర్దేశించిన ప్రాంతానికి చేరాల్సిన ఇసుకను బహిరంగ మార్కెట్‌లో విక్రయించినట్టు గుర్తించిన టీఎస్‌ఎండీసీ అధికారులు సీఐడీకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో రాహుల్‌తో కలసి అశోక్ పెద్దఎత్తున ఇసుక అక్రమంగా రవాణా చేసినట్టు నిర్దారించారు. సీపీ ఆదేశాలతో ఈ నెల 10న నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.