Plaster of Paris (POP) idols should not be immersed – హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయకూడదు.

ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోమని గతంలోనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులు మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉన్నారు.
మహానగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో 5 అడుగుల నుంచి 60 అడుగుల వరకు లక్ష గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవికాకుండా అడుగు నుంచి 5 అడుగుల వరకు విగ్రహాలు కూడా లక్షకుపైగానే ఉంటున్నాయి. గతేడాది అయిదు అడుగుల పైన ఉన్న 35 వేల పీవోపీ విగ్రహాలు సాగర్‌లో నిమజ్జనమయ్యాయి. చిన్నా పెద్దా చూసుకుంటే మొత్తం సంఖ్య 84 వేలు. గత ఏడాది కూడా సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అప్పడూ ఈ నిబంధనను పట్టించుకోలేదు. వారం రోజుల కిందట మళ్లీ కోర్టు గత ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పూర్తి ప్రణాళికను రూపొందించలేదు. సాగర్‌పై పదిహేను వరకు క్రేన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. దీంతో ట్యాంక్‌బండ్‌కే ఈసారి కూడా ప్రతిమలను తీసుకువస్తామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు.
కొలనుల్ని పట్టించుకుంటే ఒట్టు..
ట్యాంక్‌బండ్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయకుండా నాలుగైదేళ్ల కిందటే బల్దియా నగరంలో 27 నిమజ్జన కొలనులను నిర్మించింది. మహానగరంలో ఇలాంటివి ఇంకా దాదాపు 100 అవసరం. నిధుల కొరతతో కొత్త కొలనులు నిర్మించక చాలా ప్రాంతాల్లో ఇవి అందుబాటులో లేక అయిదు అడుగుల లోపు విగ్రహాలను కూడా సాగర్‌కే తీసుకువస్తున్నారు. మరోవైపు నగరంలోని చెరువుల్లో ఒక భాగాన్ని పూర్తి నీటిమట్టంతో మినీ ట్యాంకుగా చేసి అందులో అయిదు అడుగులకు పైబడిన విగ్రహాలను నిమజ్జనం చేస్తే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా మినీ ట్యాంకులుగా చేయడం వల్ల తటాకం కలుషితం కాదని పేర్కొంటున్నారు.