#Hyderabad District

Permission for construction of Congress building – కాంగ్రెస్‌ భవన నిర్మాణానికి అనుమతి

హైదరాబాద్ఎట్టకేలకు కాంగ్రెస్‌ భవన నిర్మాణానికి కంటోన్మెంట్‌ బోర్డు అనుమతులు ఇచ్చింది. దాదాపు ఏడాదిగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై గత మే నెలలోనే బోర్డు తీర్మానం ఆమోదించగా, అందుకు సంబంధించిన పత్రాలను మంగళవారం జారీ చేసింది. టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి బోర్డు కార్యాలయానికి వచ్చి పత్రాలను అందుకున్నారు. దీంతో 15 ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

ఫలించిన రేవంత్‌ పోరాటం..
2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి బోయిన్‌పల్లిలో 10–15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మరుసటి ఏడాదే వైఎస్‌ మరణం, తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పెద్దలు ఈ స్థలం విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. తాజాగా గత ఏడాది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కంటోన్మెంట్‌ బోర్డు అధికారులను కలిసి స్థలం విషయమై ఆరాతీశారు. సదరు స్థలంలో ‘గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌’ పేరిట జాతీయ శిక్షణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు.

తదనుగుణంగా నిర్మాణ అనుమతుల కోసం బోర్డును ఆశ్రయించారు. కంటోన్మెంట్‌లో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి గతేడాది సెప్టెంబర్‌ 29న జరిగిన బోర్డు సమావేశానికి హాజరై ప్రతిపాదన ఉంచారు. అయితే బీఆర్‌ఎస్‌కు చెందిన అప్పటి ఎమ్మెల్యే దివంగత సాయన్న, బీజేపీకి చెందిన బోర్డు సివిలియన్‌ నామినేటెడ్‌ సభ్యుడు రామకృష్ణ అభ్యంతరాలు లేవనెత్తడంతో అనుమతిని పెండింగ్‌లో పెట్టారు. తిరిగి ఈ ఏడాది మే 10న జరిగిన సమావేశంలో మరోసారి ఈ అంశం చర్చకు రాగా, బోర్డు భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తూ తీర్మానం చేసింది.

అన్ని అడ్డంకులు తొలగడంతో బోయిన్‌పల్లి పరిధిలోని జీఎల్‌ఆర్‌ సర్వే నెంబర్‌ 502/పీ1, పీ2లోని 50,215 గజాల విస్తీర్ణంలో భవన నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. గెస్ట్‌ హౌజ్‌, హాస్టల్‌ బ్లాకులను రెసిడెన్షియల్‌ కేటగిరీగా, ఆఫీస్‌, ఆడిటోరియం, మల్టీపర్పస్‌ హాల్‌ను కమర్షియల్‌గా పరిగణిస్తూ సెమీ రెసిడెన్షియల్‌ అనుమతులు ఇచ్చారు. టీపీసీసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లు రవి పేరిట భవన నిర్మాణ అనుమతులు మంజూరు కావడంతో మంగళవారం బోర్డు కార్యాలయానికి వచ్చిన ఆయన అనుమతి పత్రాలను అందుకున్నారు.

 
 
Permission for construction of Congress building – కాంగ్రెస్‌ భవన నిర్మాణానికి అనుమతి

Another person died in the gas leakage

Leave a comment

Your email address will not be published. Required fields are marked *