BRS – కారు ఖరారు

Hyderabad: రాజధాని పరిధిలోకి వచ్చే 29 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉప్పల్ మినహా మిగిలిన వాటిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే భారాస టిక్కెట్లను కేటాయించింది.
21 మందిలో 19 మంది మళ్లీ ఎన్నికల బరికి
ఉప్పల్ మినహా సిట్టింగులకే సీట్లు
నాంపల్లి, గోషామహల్ అభ్యర్థులు ఎవరో
రాజధాని పరిధిలోకి వచ్చే 29 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉప్పల్ మినహా మిగిలిన వాటిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే భారాస టిక్కెట్లను కేటాయించింది. ఈమేరకు సోమవారం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఈ 29 నియోజవర్గాల్లో మొత్తం 21 మంది భారాస సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఇందులో 19 మంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలో మూడోసారి బరిలో దిగుతున్న వారే అధికం. గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఆయన తనయ లాస్య నందితకు టికెట్ ఖరారు చేశారు. ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని ఆపార్టీ నేత బండారి లక్ష్మారెడ్డికి కేటాయించారు. ఇదొక్కటే పెద్ద మార్పు. ఈసారి టిక్కెట్ల ఎంపికకు సర్వేలనే ప్రాతిపదికగా తీసుకున్నారు.
వివాదాలకు దూరంగా.. అభివృద్ధితో దగ్గరగా..
సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలావరకు వివాదాలకు దూరంగా ఉన్నారు. దాదాపు అందరూ నియోజకవర్గాలను అంటిపెట్టుకునే ఉండటంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాల నిర్వహణపై దృష్టి సారించారు. రాజధానికి ప్రాతినిధ్యం వహించే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సమన్వయంతో కదిలారు. దీనికితోడు ముఖ్యమంత్రిని అనేకమార్లు కలిసి అభివృద్ధికి నిధులను కేటాయించుకోవడంలో ఎమ్మెల్యేలు ముందున్నారు. వాటితో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా చూసుకున్నారని పార్టీ భావిస్తోంది. ఇవన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ కేటాయింపులో అనుకూలంగా మారాయని తెలుస్తోంది. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి భారాసలో చేరారు. తరువాత సబితకు మంత్రివర్గంలో చోటు కల్పించగా సుధీర్‌రెడ్డికి మూసీ నది అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించారు. సిట్టింగ్‌లుగా వీరిద్దరికి మళ్లీ టిక్కెట్లు దక్కాయి.
తెలంగాణ భవన్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న కార్యకర్తలు
కేటీఆర్(KTR) ప్రోద్బలం
రాజధాని పరిధిలో సిట్టింగ్‌లకు టిక్కెట్లను కేటాయింపులో మంత్రి కేటీఆర్ పాత్ర అధికంగా ఉందని చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండి అభివృద్ధి నిధుల విషయంలో ఆయనపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకున్నారు. మంత్రి కేటీఆర్ కూడా తరచూ వారి నియోజకవర్గాల్లో పలుమార్లు పర్యటించారు. కొత్తవారికంటే అన్ని విషయాలు తెలిసిన సిట్టింగ్‌లకే ఈసారి స్థానం కల్పిస్తే బావుంటుందన్న నిర్ణయానికి వచ్చిన కేటీఆర్ ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ విషయాలన్నింటిని తీసుకువచ్చారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆశావహుల అసంతృప్తి
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా భారాస టిక్కెట్ దక్కించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని కొంతమంది నేతలు కలగన్నారు. కొందరు అనుకున్నది సాధించారు. మరికొందరు నైరాశ్యంలో మునిగిపోయారు. వీరిలో కొంతమంది ఇతర పార్టీలవైపు చూస్తుండగా మరికొంతమంది పార్టీ అధినేతపై నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు అసంతృప్త నేతల కదలికలపై కన్నేశారు. వీరిని దారిలోకి తెస్తేనే పూర్తి ఫలితం ఉంటుందని భారాస అగ్రనాయకత్వం భావిస్తోంది. నియోజకవర్గంలో ప్రభావం చూపించే కొంతమంది నాయకులను బుజ్జగించాలని నిర్ణయించారు. మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి వచ్చిన తరువాత వారందరితోనూ మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రావుల శ్రీధర్‌రెడ్డికి, అక్కడి ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అంబర్‌పేటలో ఎడ్ల సుధాకర్‌రెడ్డి, కూకట్‌పల్లిలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు ఇలా కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్నారు.
పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హడావుడి
- కంటోన్మెంట్లో కీలక నేతగా ఉన్న మన్నె క్రిశాంక్ ఈసారి ఎన్నికల బరిలో నిలవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇక్కడి నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న ఇటీవలే చనిపోయారు. ఆయన కుటుంబంలో రాజకీయ అనుభవజ్ఞులు లేకపోవడంతో తనకే టిక్కెట్ వస్తుందన్న భావనలో క్రిశాంక్ ఉండిపోయారు. దీనికితోడు మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా మెలిగారు. దీంతో ఆయనకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్, పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు దక్కాయి. చివరి నిమిషంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాయన్న కుమార్తె లాస్యనందితకు టిక్కెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై క్రిశాంక్ కొంత అసంతృప్తికి లోనైనా మంత్రి కేటీఆర్ బుజ్జగించినట్లు సమాచారం.
- ఉప్పల్ టిక్కెట్ కోసం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ విశ్వప్రయత్నాలు చేశారు. మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండటంతో తనకు టిక్కెట్ దక్కుతుందని భావించారు. మొదటి నుంచి రామ్మోహన్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డితో తీవ్రంగా విభేదించారు. వీరిద్దరి మధ్య వైరుద్ధ్యం పార్టీకి సమస్యగా మారింది. సర్వే నివేదికలు సుభాష్‌రెడ్డికి అనుకూలంగా లేకపోవడంతో టిక్కెట్ కోసం రామ్మోహన్ గట్టిగా ప్రయత్నించారు. చివరి నిమిషంలో బండారి లక్ష్మారెడ్డికి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలియడంతో రామ్మోహన్, సుభాష్‌రెడ్డి ఒకే తాటిపైకి వచ్చి తమ ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా సమ్మతమేనంటూ ఎమ్మెల్సీ కవితను కలిసి చెప్పినా ప్రయోజనం కలగలేదు.
- మహేశ్వరం టిక్కెట్‌ను తీగల కృష్ణారెడ్డి ఆశించారు. ఈ విషయాన్ని వివిధ రూపాల్లో పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చారు. తనకు టిక్కెట్ ఇవ్వపోతే పార్టీ మారతాననే సంకేతాలు కొద్దిరోజుల కిందట ఇచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి అప్పటి తెరాసలో చేరిన సబితా ఇంద్రారెడ్డి మంత్రివర్గంలో చేరి పార్టీకి విధేయురాలిగా ఉంటున్నారు. మంత్రిగా ఆమె పనితీరు సంతృప్తిగా ఉందని పార్టీ భావించడంతో ఆమెకే టిక్కెట్ దక్కింది. ఇక తీగల.. పార్టీ మారతారా లేదా అనేది త్వరలో తేలనుంది.
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అదే స్థానంలో పోటీ చేయడంతోపాటు మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్‌ను బరిలో దింపాలనుకున్నారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చారు కూడా. దీనికి మంత్రి హరీష్‌రావు అడ్డుపడ్డారన్న ఉద్దేశంలో ఆయనపై సోమవారం తిరుపతిలో తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో మైనంపల్లికి మల్కాజిగిరి టిక్కెట్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే మంత్రి హరీష్‌రావుపై ఆరోపణలు చేయడంపై అధిష్ఠానం సీరియస్‌గా ఉందని తెలిసింది.
ఇద్దరు మహిళలకు చోటు
రాజధానిలో భారాస ఈసారి ఇద్దరు మహిళలకు టికెట్లు ఖరారు చేసింది. గత శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి పోటీకి దిగనున్నారు. తొలి జాబితాలోనే అమె పేరును అధిష్ఠానం ప్రకటించింది. కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత పేరును కేసీఆర్ ప్రకటించారు. ఈ టికెట్ కోసం చాలామంది పోటీపడినా అధిష్ఠానం లాస్యనందిత పేరునే ఖరారు చేసింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాటం చేస్తున్న తరుణంలో గ్రేటర్లో మహిళలకు మరిన్ని సీట్లు కేటాయించి ఉంటే మంచి సంకేతాలు వెళ్లేవి అనే సూచనలు వచ్చాయి. 33 శాతం అంటే దాదాపు 10 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.
స్వీయ బలంతో తొలిసారి బరిలోకి
అధికార భారాస రాజధానిలో ఈసారి పూర్తి స్వీయ బలంతో బరిలో దిగుతోంది. ప్రతిసారి ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థుల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వగా.. ఈసారి అలాంటి పరిస్థితి కన్పించలేదు. పూర్తిగా పార్టీ నేతలు, సిట్టింగ్‌లకే సీట్లు ఖరారు చేశారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి క్లీన్‌స్వీప్ చేస్తామనే విశ్వాసంతో ఉన్నారు. మొత్తం 29 స్థానాలను గెల్చుకుంటామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారాస (అప్పటి తెరాస) ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు.. పొత్తుల వివరాలు ఇలా..
- 2004లో కాంగ్రెస్‌తో కలిసి 13 స్థానాలకుగాను 6 పోటీ చేసి రెండే గెలిచింది.
- 2009లో తెదేపా, వామపక్షాలతో కలిసి 24లో 9 చోట్ల పోటీ చేసినా ఒక్కటీ గెలవలేదు.
- తెలంగాణ ఏర్పడ్డాక 2014లో 24 స్థానాలకు పోటీ చేసినా మూడే గెలుపొందింది.
- 2014లో గ్రేటర్లో 8 స్థానాలు గెల్చుకున్న తెదేపా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. 2106 బల్దియా ఎన్నికల్లో ఏకంగా 99 మంది కార్పొరేటర్లను గెలిపించుకుంది.
- 2018 ఎన్నికల్లో రాజధాని పరిధిలో 27 స్థానాలకు పోటీ చేసి 17 గెల్చుకుంది. మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి 24 స్థానాలు అవుతాయి. ఆ ఎన్నికల అనంతరం సబితా ఇంద్రారెడ్డిని, సుధీర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌ను బలహీనపరచింది.