The work of the third railway has reached its final stage – తుది దశకు మూడో రైల్వేలైన్ పనులు

ఉత్తరాది.. దక్షణాది రాష్ట్రాల మధ్య రాకపోకలకు కీలకమైన కాజీపేట- బల్లార్ష మూడో రైలు మార్గం పనులు తుది దశకు చేరాయి. ఈ పనుల నేపథ్యంలో కాజీపేట- వరంగల్- బల్లార్ష మీదుగా నడిచే 16 రైళ్లను ఈ నెల 26వ తేదీ వరకు రద్దు చేశారు. అందులో కొన్నింటిని దారి మళ్లించారు. మరికొన్ని బెల్లంపల్లి నుంచి నడిపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
మహారాష్ట్రలోని వీరూర్ నుంచి కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ వరకు మూడో రైల్వేలైన్, కాగజ్‌నగర్ స్టేషన్‌లో నాలుగో లైన్ పనులను ఈ నెల 25 వరకు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. అనంతరం ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గడువులోపు పనులు పూర్తయ్యేలా కాజీపేట రైల్వే చీఫ్ మేనేజర్ రామారావు పర్యవేక్షిస్తున్నారు. కాజీపేట జంక్షన్ పరిధిలోని ఇంజినీరింగ్, సిగ్నల్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఓహెచ్‌ఈ, ఆపరేటింగ్ కన్‌స్ట్రక్షన్ విభాగాలకు చెందిన అధికారులు, కూలీలు దాదాపు 1000 మందిపైనే పనులు చేస్తున్నారు. ఆధునిక యంత్రాలు వినియోగిస్తున్నారు.
మూడేళ్ల క్రితమే ప్రారంభం
కాజీపేట- బల్లార్ష వరకు 226 కిలోమీటర్ల వరకు మూడో రైల్వే నిర్మాణానికి రూ.2,063 కోట్ల వ్యయంతో మూడేళ్ల క్రితమే శ్రీకారం చుట్టారు. మొదట రాఘవాపురం నుంచి మందమర్రి వరకు ట్రాక్ పనులు సాఫీగా పూర్తయ్యాయి. జిల్లాలో కాగజ్‌నగర్- సిర్పూర్(టి) మండలాల్లో పులుల సంచారం ఉన్నందున 24 కిలోమీటర్ల మేర అటవీ అనుమతులు రావడానికి తీవ్ర జాప్యమైంది. ఎట్టకేలకు ఈ ఏడాది ప్రారంభంలో అనుమతులు రాగా పనులు ముమ్మరం చేశారు. ఈ నెల 25వ తేదీలోపు కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ వరకు మూడో రైల్వే లైన్ పనులను పూర్తి చేయనున్నారు. ఉప్పల్ నుంచి వరంగల్ వరకు మరిన్ని పనులకు మరో మూడేళ్ల గడువు ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. రైల్వేలైన్ పనులతోపాటు వాగులు, నదులపై వంతెనల నిర్మాణాలు కొనసాగుతున్నా.. పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
గంటల తరబడి ఆలస్యం
దిల్లీ నుంచి కాజీపేట- వరంగల్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు రెండు నుంచి 3 గంటల పాటు ఆలస్యంగా నడుస్తోంది. భాగ్యనగర్, సింగరేణి, కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, తదితర రైళ్లు బెల్లంపల్లి నుంచి నడిపిస్తుండటంతో కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన ఏరియాల్లోని ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. మంచిర్యాల, కాజీపేట, హైదరాబాద్ వెళ్లాలంటే బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారులు కాగజ్‌నగర్ నుంచి బెల్లంపల్లి వరకు ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ అమలు చేయడం లేదు.