Tenant farmer commits suicide – గడ్డిమందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

అప్పులు తీర్చడానికి రెండు సార్లు దుబాయ్ వెళ్లాడు. ఆ భారం పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ ఏడాది నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేసిన అతను ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జన్నారం మండలం చింతగూడలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీపతి రామ్మూర్తి(50) గతంలో దుబాయ్ వెళ్లగా సరైన పని దొరకకపోవడంతో తిరిగి మూడేళ్ల కిందట స్వగ్రామానికి వచ్చారు. బయటి దేశం వెళ్లేందుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మధనపడేవాడు. ఈ ఏడాది భూమిని కౌలుకు తీసుకొని సాగు చేశారు. సోమవారం గ్రామానికి చెందిన కోటగిరి వెంకన్న(75) అనారోగ్యంతో మృతి చెందడంతో.. అంత్యక్రియలకు హాజరైన అతను అన్ని పనులు దగ్గరుండి చేశారు. అనంతరం ఇంటికి చేరుకున్న అతను గడ్డి మందు తాగి తననెవరూ కాపాడవద్దంటూ పరుగు తీశారు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతన్ని పట్టుకొని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతునికి భార్య అనసూయ, కూతురు ప్రసన్నాంజలి, కుమారుడు బాలాజీ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై పి.సతీష్ వివరించారు.