#Adilabad District

New job posts should be given.. – జిల్లాకు కొత్త పోస్టులు ఇవ్వండి..

కుటుంబ సభ్యులను కోల్పోయి వారి స్థానంలో ఉద్యోగం(Job) కోసం ఎదురుచూస్తున్న వారికి ఏళ్లుగా నిరాశే ఎదురవుతోంది. ఇతర శాఖల్లో కారుణ్య నియామకాలు త్వరితగతిన జరుగుతున్నా పంచాయతీరాజ్‌లో ఏళ్లు గడిచినా అడుగు ముందుకు పడటం లేదు. అటు ఆప్తులను కోల్పోయి, ఇటు ఉద్యోగాలు రాక ఆ కుటుంబాలు ఎంతో మనోవేదనకు గురవుతున్నాయి. ఖాళీలు లేకపోవడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. జిల్లాకు సూపర్‌ న్యూమరరీ(తాత్కాలికంగా) కొత్త పోస్టులు మంజూరు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ నుంచి పంచాయతీరాజ్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ డెరెక్టర్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు.

కొత్త జిల్లాల పునర్విభజన తర్వాత కారుణ్య నియామకాల జాబితాను జిల్లాల వారీగా విభజించారు. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం 37 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరు ఎనిమిదేళ్ల నుంచి జడ్పీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఉద్యోగులు, జడ్పీ, మండల పరిషత్‌ పాఠశాలలో పని చేసే బోధనేతర సిబ్బందిని పంచాయతీరాజ్‌(పీఆర్‌) ఉద్యోగులుగా పరిగణిస్తారు. స్థానిక సంస్థల ఉద్యోగులుగా పిలిచే వీరికి ఇతర శాఖల్లో కారుణ్య నియామకాలు ఇవ్వడం లేదు. అందుకే ఇక్కడ కారుణ్య నియామకాల్లో తీవ్ర జాప్యమవుతోంది. చిక్కంతా పీఆర్‌లో ఖాళీలు లేకపోవడమే. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 258 మంది పంచాయతీరాజ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. కొత్త పోస్టులు భర్తీ చేయాలంటే ఖాళీలు అవసరం ఉండటంతో ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. మరోపక్క కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబీకులు నిత్యం అధికారులను కలిసి తమ గోడు వినిపిస్తున్నారు. నాలుగో  తరగతి ఉద్యోగి(ఆఫీస్‌ సబార్డినేట్‌) పోస్టులు మూడు ఖాళీగా ఉన్నా ఆ ఉద్యోగంపై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రతి ఒక్కరు జూనియర్‌ అసిస్టెంట్‌గానే పని చేసేందుకు మొగ్గు చూపుతుండటం విశేషం.

పోస్టులు మంజూరు చేసే  అధికారం పాలనాధికారికి..

జిల్లా కలెక్టర్‌కు ఏడాదికి అయిదు వరకు సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించే(మంజూరు చేసే) అధికారం ఉంది. ఈ పోస్టులో నియమితులైన ఉద్యోగులకు వేతనం మాత్రం వస్తుంది. కానీ వారిని శాశ్వత(పర్మినెంట్‌) ఉద్యోగులుగా పరిగణించరు. కేవలం తాత్కాలిక ఉద్యోగులుగానే గుర్తిస్తారు. పదోన్నతులతో కింది స్థాయిలో ఖాళీలు ఏర్పడినప్పుడు అక్కడ వారిని నియమించి శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తారు. మూడేళ్లుగా సూపర్‌ న్యూమరరీ పోస్టుల కేటాయింపుపై స్పష్టత కరవై కలెక్టర్లు తమ అధికారాలను వినియోగించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పోస్టులు మంజూరుకాక నష్టం ఏర్పడుతోంది. తాజాగా ఆగస్టు 11న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పేరిట హైదరాబాద్‌లోని పీఆర్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ డైరెక్టర్‌కు లేఖ వెళ్లడంతో అలాగైనా కొత్త పోస్టుల వస్తాయని అందరు ఆశలు పెంచుకుంటున్నారు.

  • ఈ విషయమై జడ్పీ సీఈఓ గణపతి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *