Employees on strike.. Stopped operations – సమ్మెలో ఉద్యోగులు.. నిలిచిన కార్యకలాపాలు

ఉద్యోగ భద్రత కల్పిస్తూ సర్వీసును క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్‌తో విద్యా శాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వారి సమ్మె రోజురోజుకు ఉద్ధృతం అవుతోంది. ఇప్పుడిప్పుడే ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు కస్తూర్బా బాలికల విద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది రోజుకు సగం మంది ఆందోళనలో భాగస్వాములవుతుండటంతో బోధన కుంటుపడుతోంది.
జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యాశాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో క్షేత్రస్థాయిలో పాఠశాలలను పర్యవేక్షించే క్లస్టర్ రిసోర్సు పర్సన్లు మొదలుకొని మండల వనరుల కేంద్రాల్లో పని చేసే సీసీవోలు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, భవిత కేంద్రాల విలీన విద్య రిసోర్సుపర్సన్లు, డీఈవో కార్యాలయంలో పని చేసే డీపీవో సిబ్బంది 15 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. జిల్లాలోని 17 కస్తూర్బాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది రోజుకు కొంతమంది సమ్మెలో భాగస్వాములవుతూ నిరసనల్లో పాల్గొంటున్నారు.
అమలులో ఆటంకాలు
సర్కారు బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం బియ్యం కోటా విడుదల కావాలన్నా, కార్మికులకు నెలవారీ బిల్లులు మంజూరు కావాలన్నా సీఆర్పీల పని తీరుపై ఆధారపడి ఉంది. తాజాగా ప్రారంభమైన ఫేషియల్ యాప్ అమలులోనూ వీరి పర్యవేక్షణ ప్రధానంగా మారింది. రెండో విడత పాఠ్యపుస్తకాల పంపిణీ ఆగిపోయింది. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను డీపీవో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులను ప్రత్యామ్నాయంగా విద్యాశాఖ వినియోగించుకుంటోంది. ఎప్పటికప్పుడు సమాచారం తీసుకురావడంతో, చేరవేయడంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎంతో చురుగ్గా పని చేస్తున్న క్రమంలో సమ్మెతో ఆయా కార్యకలాపాలు నెమ్మదించాయి. ప్రత్యామ్నాయ మార్గంగా అన్నింటా ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో విద్యార్థులకు విద్య అందకుండాపోతోంది.
- జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఇందులో డీపీవో సిబ్బంది 12 మంది, సీఆర్పీలు 69, కేజీబీవీ, యూఆర్ఎస్ సిబ్బంది 388, సీసీవోలు 15, ఎంఐఎస్‌లు 17, మెసేంజర్లు 10, ఐఈఆర్పీలు 22, కేర్ గివింగ్ వాలంటీర్లు ఏడుగురు ఉన్నారు. వీరిలో కేజీబీవీ సిబ్బంది మినహా మిగిలిన వారంతా రెండు వారాలుగా సమ్మె చేస్తూ విధులకు దూరంగా ఉంటున్నారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం అందరిలా తమను రెగ్యులర్ చేయాలని వారంతా కోరుతున్నారు.
- సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టి మంగళవారానికి 15 రోజులు పూర్తయ్యాయి. నిరసనలు తెలుపుతూ కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. పిల్లలతోనూ వచ్చి నిరసనలో భాగస్వాములవుతున్నారు. వివిధ పార్టీల నాయకులు, సంఘాలు వారికి మద్దతుగా నిలుస్తున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోయిందనే బాధ వారిని వెంటాడుతోంది.