కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక తల్లిదండ్రులు, బంధువులు, కాలనీవాసులు మంగళవారం పాఠశాలకు వెళ్లి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు
మునగపాక, న్యూస్‌టుడే: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక తల్లిదండ్రులు, బంధువులు, కాలనీవాసులు మంగళవారం పాఠశాలకు వెళ్లి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. అనకాపల్లి జిల్లా మునగపాక- 2 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివకోటి దుర్గాప్రసాదు ఇక్కడే అయిదో తరగతి చదువుతున్న బాలికపై 15 రోజుల కిందట అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్పటి నుంచి విద్యార్థిని పాఠశాలకు వెళ్లలేదు. ఎప్పుడూ చలాకీగా ఉండే తమ కూతురు ఇంటి వద్ద ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. తన పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక చెప్పడంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు, బంధువులు పాఠశాలకు వెళ్లి ఆ ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. ఈ సమయంలో కాలనీకి చెందిన యువకులు జోక్యం చేసుకుని అతనిని అక్కడి నుంచి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐ గఫూర్ బాధిత బాలికను, తల్లిదండ్రులను, చుట్టుపక్కల వారిని విచారించారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.