Kadapa : భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య

కడపలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక కోపరేటివ్ కాలనీలో వెంకటేశ్వర్లు (50) అనే హెడ్ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటలకు పీఎస్ నుంచి పిస్తోలు తెచ్చుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్ ఇలా చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.