JUBLIEHILLS – కుమార్తె కళ్లెదుటే తండ్రి ఆత్మహత్య

కన్నబిడ్డకు పెళ్లి చేయడానికి అవసరమైన డబ్బు లేదన్న బాధతో ఆమె ఎదుటే తండ్రి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. హైదరాబాద్ హుస్సేనీ అలంలో నివాసం ఉంటున్న ఏఆర్ఎస్సై ఫాజిల్ అలీ(59) ఏడాదికాలంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద గన్‌మేన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. వారికి విడాకులు కావడంతో పుట్టింట్లోనే ఉంటున్నారు. కుమారుడు సంతోష్‌నగర్‌లో చిరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. మూడో కుమార్తె ఆసియా ఫాతిమాకు పెళ్లి చేయాలని భావించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన.. కుమార్తె వివాహం చేసేందుకు అవసరమైన డబ్బు కోసం ప్రైవేట్ బ్యాంకులో రుణానికి ప్రయత్నించారు. మూడేళ్లలో ఉద్యోగ విరమణ ఉండటంతో రుణం మంజూరు కాలేదు. ఈ విషయమై మూడు రోజులుగా కుటుంబ సభ్యుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కుమార్తె ఆసియా ఫాతిమాను తనతో రమ్మన్నారు.
శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటికి వెళ్లి.. తన తుపాకీ తెచ్చుకున్నారు. అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్న ఓ టీ స్టాల్ వద్దకు కుమార్తెతో కలిసి వెళ్లారు. కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ.. జై అంటూ నినాదం చేశారు. అంతలోనే తన 9 ఎంఎం పిస్టల్ బయటకు తీయడంతో కంగారుపడిన ఫాతిమా తండ్రి వద్దకు పరుగెత్తింది. ఆమె చేరుకునేలోపే.. కణత సమీపంలో కాల్చుకోవడంతో ఫాజిల్ అలీ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. తన కళ్లెదుటే తండ్రి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆసియా ఫాతిమా షాక్‌కు గురైంది. గుండెలవిసేలా రోదించింది. సంఘటన స్థలాన్ని మంత్రి సబిత, పలువురు పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. ఫాతిమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఫాజిల్ తన కుమార్తెకు ఓ పుస్తకం ఇచ్చారు. అందులో తన మనోవేదనను రాసినట్లు పోలీసులు గుర్తించారు. తనకు సమస్యను చెప్పి ఉంటే సాయం చేసేదాన్నంటూ ఫాజిల్ కుటుంబ సభ్యులను మంత్రి సబిత ఓదార్చారు.