ACB searches in RJD office of education department – విద్యాశాఖ ఆర్ జె డి(RJD) కార్యాలయంలో ఏసీబీ(ACB) సోదాలు

విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు కార్యాలయంలోని పత్రాలను అధికారులు పరిశీలించారు. ఫరూఖ్‌నగర్‌లోని సీబీఎస్‌ఈ పాఠశాల ఉన్నతీకరణకు అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పాఠశాల విద్యా శాఖ సిబ్బంది ముగ్గురు ఏసీబీకి అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీబీఎస్ఈ పాఠశాలకు సంబంధించిన అనుమతి పత్రాల వివరాలను అధికారులు పరిశీలించారు. ఎన్ని రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నారనే విషయాలను ఆరా తీశారు.
బాధితుడు శేఖర్‌ను మొదట ఆర్జేడీ విజయలక్ష్మి పీఏ సతీష్ రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు అనిశా అధికారులు తెలిపారు. ఆ తర్వాత సూపరింటెండెంట్ జగ్జీవన్‌ను బాధితుడు శేఖర్ కలువగా.. మొత్తం రూ.80 వేలు లంచం ఇవ్వాలని ఇందులో అందరం వాటాలు పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణచందర్‌రావును శేఖర్ కలిశాడు. గురువారం సాయంత్రం రూ.80 వేల లంచాన్ని సూపరింటెండెంట్ జగ్జీవన్‌కు శేఖర్ ఇచ్చాడు. ఆ డబ్బులను లెక్కించిన జగ్జీవన్.. ఏడీ పూర్ణచందర్ రావు వద్దకు తీసుకెళ్లాడు. పూర్ణచందర్ రావు సైతం డబ్బులను మరోసారి లెక్కిస్తుండగా.. అదే సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దీంతో ఏడీ, సూపరింటెండెంట్, పీఏను విచారించిన అనంతరం వారిని అనిశా అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ తెల్లవారుజామున అనిశా కార్యాలయానికి తరలించారు. ముగ్గురినీ సాయంత్రం లోపు రిమాండ్‌కు తరలించనున్నారు. ఆర్జేడీ విజయలక్ష్మికి నోటీసులిచ్చి ప్రశ్నించనున్నట్లు అనిశా అధికారులు తెలిపారు. లంచాన్ని వాటాలుగా పంచుకోవాల్సి ఉంటుందని నిందితులు చెప్పడంతో ఎవరెవరికి వాటాలు అందుతున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు.