Waheeda Rahman – హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి.

భారతీయ సినీ చరిత్రలో వహీదా రెహమాన్‌ని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా పరిగణిస్తుంటారు. ఐదు దశాబ్దాల ఆమె సినీ జీవితంలో తొంభైకిపైగా సినిమాల్లో నటించారు. 1955లో ‘రోజులు మారాయి’తో ఆమె వెండితెర ప్రస్థానం మొదలైంది. ఆనాటి దిగ్దర్శకుడు, నటుడు గురుదత్‌తో కలిసి ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘కాలా బాజార్’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ లాంటి మరపురాని చిత్రాల్లో అత్యుత్తమ నటన ప్రదర్శించారు. 1965లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘గైడ్’ ఆమె ప్రతిభకి ఓ మచ్చుతునక. ఆ నటనకే ఉత్తమ నటిగా తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ‘నీల్‌కమల్’, ‘చౌదావీ కా చాంద్’, ‘రామ్ ఔర్ శ్యామ్’, ‘సి.ఐ.డి.’, ‘ఖామోశీ’ చిత్రాల్లో నటనతో అందలానికి చేరారు. రొమాన్స్, సెంటిమెంట్, డ్రామా, హారర్.. ఎలాంటి భావోద్వేగాలనైనా అలవోకగా పలికించే వహీదా.. దిలీప్‌కుమార్, రాజేంద్రకుమార్, రాజ్‌కపూర్, రాజేశ్ ఖన్నా, దేవానంద్, సునీల్‌దత్, బిశ్వజిత్.. లాంటి అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి పని చేశారు. ఆమె నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘బీస్ సాల్ బాద్’ 1962లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘తీస్రీ కసమ్’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘ఖామోశీ’ చిత్రంలో ప్రేమలో విఫలమై, చివరికి పిచ్చిదానిలా మారిన నర్సుగా తన నటన పతాకస్థాయిలో ఉందని అంతా మెచ్చుకున్నారు. ఆమె హిందీతోపాటు కొన్ని తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌రేతో ‘అభిజన్’లో కలిసి పని చేశారు. తర్వాత మరికొన్ని బెంగాలీ సినిమాల్లో నటించారు.