#Cinema

Teja Sajja: తేజ సజ్జాకు మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ అవార్డు.. ఇది ఆరంభం మాత్రమే అంటూ పోస్ట్‌

మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌గా తేజ సజ్జా అవార్డు అందుకున్నారు.

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ సజ్జా (Teja Sajja).. ‘హనుమాన్‌’తో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రంలో హనుమంతు పాత్రతో మెప్పించారు. తాజాగా ఈ యంగ్‌ హీరో మోస్ట్ పాపులర్‌ యాక్టర్‌గా ‘గామా అవార్డు’ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు అందుకుంటున్న ఫొటోలను షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ‘దీన్ని హనుమంతుడికి అంకితమిస్తున్నా. ఈ అవార్డు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ‘హనుమాన్‌’కు ఇలాంటి ఎన్నో అవార్డులు వస్తాయని సినిమా విడుదలకు ముందే భావించాం. ఇది ప్రారంభం మాత్రమే.. ఈ చిత్రం ఇలాంటి వాటిని మరిన్ని గెలుచుకోవాలని ఆశిస్తున్నా’ అని రాశారు. దీంతో నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ‘హనుమాన్‌’కు త్వరలోనే సీక్వెల్‌ రానుంది. ‘జై హనుమాన్‌’ పేరుతో ప్రశాంత్‌వర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. దీని గురించి ఇటీవల దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘హను-మాన్‌’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉండనుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. సీక్వెల్‌లోనూ అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడు. కానీ, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారు. 2025లో ఇది విడుదల కానుంది’ అని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *