pushpa 3 movie: ‘కేజీయఫ్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘పుష్ప’ రాజ్

‘పుష్ప 3’ గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి ఆ మూవీ ఎప్పుడు ఉంటుందో తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: గత కొన్ని రోజులుగా భారీ బడ్జెట్ చిత్రాలన్నీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తున్నాయి. కథ డిమాండ్ చేసి, కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంటే, మూడో భాగానికి బాటలు వేసి వదిలేస్తున్నారు దర్శకులు. ఇప్పటికీ ‘కేజీయఫ్3’ ప్రాజెక్ట్ సజీవం. ఈ జాబితాలో ఇప్పుడు ‘పుష్ప’ కూడా వచ్చి చేరింది. ‘పుష్ప2: ది రూల్’ (Pushpa2 The Rule) విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘పుష్ప3’ చేయడానికి స్కోప్ ఉందని చిత్రబృందం కూడా పలు వేదికలపై ప్రకటించింది. అయితే, ఈ విషయంలో ‘కేజీయఫ్’ ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ వేరే కమిట్ మెంట్స్‌కు వెళ్లిపోయారు. నీల్ ఇప్పుడు ప్రభాస్‌తో ‘సలార్-2’ ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేస్తున్నారు. యశ్ ‘టాక్సిక్’ పూర్తి చేయాలి. అప్పుడే ‘కేజీయఫ్ 3’ పట్టాలెక్కే అవకాశం ఉంది. అందుకు కనీసం మూడేళ్లు పట్టవచ్చు. మధ్యలో యశ్ ఇంకేదైనా ప్రాజెక్ట్ ఒప్పుకొంటే ఇంకా ఆలస్యం కావచ్చు.
ఇప్పుడు ‘పుష్ప3’ విషయంలోనూ ఇదే ఫార్ములా అమలుకానున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప2’ పూర్తయిన వెంటనే ‘పుష్ప3’ మొదలుకాదు. అల్లు అర్జున్ (Allu arjun) వేరే దర్శకులతో రెండు సినిమాలు చేసే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. అట్లీతో మూవీకి సంబంధించి కథా చర్చలు కూడా జరిగాయి. అయితే, అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. అలాగే త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని అల్లు అర్జున్ గతంలోనే చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథను ఆయన సిద్ధం చేస్తున్నారట. ‘పుష్ప’లో పూర్తి మాస్ హీరోగా కనిపించిన బన్నీ.. త్రివిక్రమ్ మూవీలో ‘అల వైకుంఠపురములో’ మాదిరిగా క్లాస్‌గా కనిపించేలా కథను, పాత్రలను తీర్చిదిద్దుతున్నారు.
మరోవైపు సుకుమార్ కూడా రామ్‌చరణ్ ప్రాజెక్ట్ కోసం పనిచేయాలి. బుచ్చిబాబు మూవీ పూర్తి చేస్తే కానీ చరణ్ అందుబాటులోకి రారు. అప్పుడే సుకుమార్-చరణ్ మూవీ పట్టాలెక్కుతుంది. అప్పటివరకూ సుక్కు వేచి చూస్తారా? మధ్యలో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారా? చూడాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి కనీసం మూడేళ్లు పట్టవచ్చు. ఈ లెక్కన ‘కేజీయఫ్3’, ‘పుష్ప3’ కాస్త అటూ ఇటూగా సెట్స్‌పైకి వెళ్లవచ్చు.
ఒక్క గాయని ఆరు భాషల్లో..
సింగర్ శ్రేయా ఘోషల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె పాడిన పాటలన్నీ దాదాపు సూపర్‌హిట్‌లే. ఇప్పుడు మరోసారి తన గాత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ‘పుష్ప2’ నుంచి వరుస అప్‌డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ‘సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అంటూ సాగే కపుల్ సాంగ్‌ను శ్రేయా ఘోషల్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో ఆలపించారు. మే 29 ఉదయం 11.07కు ఈ పాటను విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. ఒక్క పాటను ఆరు భాషల్లో ఒకే గాయనితో పాడించి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు దేవిశ్రీ.