Oscars 2024: RRR is making a comeback once again.. మరోసారి మార్మోగుతున్న ఆర్ఆర్ఆర్.. ఈసారి పాటే కాదు ఏకంగా

ర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా RRR. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది ఎన్నో రికార్డులను తిరగరాసింది. కలెక్షన్సే కాదు అంతకుమించి అన్నట్లు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. నాటు నాటు పాట అయితే ఏకంగా హాలీవుడ్ గడ్డపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను వశం చేసుకుంది. తాజాగా జరిగిన 96వ ఆస్కార్ వేడుకల్లోనూ మరోసారి ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది.
నాటు నాటు విజువల్స్..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సోమవారం (మార్చి 11) నాడు అకాడమీ అవార్డులను ప్రకటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు ప్రకటించే సమయానికి నాటు నాటు పాట విజువల్స్‌ను బ్యాగ్రౌండ్లో ప్లే చేశారు. ఓపక్క ఆ పాట ప్లే అవుతుండగా అరియానా గ్రాండే, సింతియా ఎరివో స్టేజీపైకి వచ్చి విజేతలను ప్రకటించారు. బార్బీ సినిమాలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? అనే పాటకుగానూ బిల్లీ ఈలిష్, ఫిన్నియాస్ ఓకోనల్ పురస్కారం అందుకోవాలని పిలిచారు.
యాక్షన్ సీన్ కూడా..
ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేసింది. ఆస్కార్ గడ్డపై మరోసారి ఆర్ఆర్ఆర్ అంటూ క్యాప్షన్ జోడించింది. అక్కడ నాటు నాటు పాట మాత్రమే కాకుండా సదరు మూవీలోని ఓ యాక్షన్ సీన్ కూడా ప్లే చేశారు. జీవితాన్ని రిస్క్ చేసే స్టంట్స్ మాస్టర్లకు సలాం కొడుతూ గొప్ప స్టంట్స్ సన్నివేశాల వీడియోను ఆస్కార్ వేదికపై ప్రదర్శించారు. అందులో హాలీవుడ్ చిత్రాలతో పాటు నాటు నాటులోని క్లైమాక్స్ సీన్ కూడా చోటు దక్కించుకుంది. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ హవా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని, జక్కన్న సినిమా అంటే అట్లుంటదని కామెంట్లు చేస్తున్నారు.