Mr.360 – వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుపులు.

మొన్నటివరకు వన్డేల్లో భారీ స్కోర్లు చేయలేక తడబడిన సూర్యకుమార్ యాదవ్ (Surya kumar yadav) వన్డే ప్రపంచకప్ ముంగిట తనదైన శైలిలో చెలరేగుతున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అర్ధ శతకాలు బాది సత్తాచాటాడు.టీ20ల్లో మొనగాడు.. కానీ వన్డేలకొచ్చేసరికి నామమాత్ర ఆటగాడు! పొట్టి ఫార్మాట్లో 360 డిగ్రీల ఆటతీరుతో పరుగుల సునామీ సృష్టిస్తాడు.. కానీ 50 ఓవర్ల క్రికెట్లో మాత్రం క్రీజులో నిలబడలేక వికెట్ పారేసుకుంటాడు! అలాంటి ఆటగాడు ప్రపంచకప్ జట్టు (World Cup 2023)లో ఎందుకు? అతనికి బదులు ప్రతిభావంతులైన ఇతరులకు ఛాన్స్ ఇవ్వొచ్చు కదా? అనే ప్రశ్నలు. కానీ ఆ ఆటగాడు ఒక్కసారిగా జూలు విదిల్చాడు. వన్డేల్లోనూ పరుగులు చేయగల సామర్థ్యం ఉందని తన ఆటపై నెలకొన్న సందేహాలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ప్రపంచకప్ ముందు వన్డేల్లోనూ జోరందుకుని జట్టు నమ్మకాన్ని నిలబెట్టేలా కనిపిస్తున్నాడు. ఆ ఆటగాడే సూర్యకుమార్ యాదవ్ (Surya kumar yadav) అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లోనూ అర్ధశతకాలు సాధించి సత్తాచాటాడీ ముంబాయి బ్యాటర్.