#Cinema

‘Month of Madhu’ – ‘మంత్‌ ఆఫ్‌ మధు’

నవీన్‌ చంద్ర, స్వాతి జంటగా శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’. యశ్వంత్‌ ములుకుట్ల నిర్మించారు. శ్రేయ, హర్ష, మంజుల ఘట్టమనేని తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా ఈనెల 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర ట్రైలర్‌ చూసినప్పుడే ఫీల్‌ గుడ్‌ మూవీ అనిపించింది. నటీనటులు, సినిమాని తెరకెక్కించిన తీరు, నేపథ్య సంగీతం.. అన్నీ బాగున్నాయి. తప్పక ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్‌ ట్రైలర్‌ ‘మంత్‌ ఆఫ్‌ మధు’. మిగతా చిత్రాలకు ఇది పూర్తి భిన్నమని ఆ ట్రైలర్‌తోనే అర్థమవుతుంది. నవీన్‌ నాకు మంచి మిత్రుడు. ఇందులో తన నటన అద్భుతంగా ఉంటుంది. అచ్చు రాజమణి చేసిన పాటలన్నీ బాగున్నాయి’’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ చిత్ర హీరో నవీన్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఇలాంటి చిత్రాలు, పాత్రలు అరుదుగా వస్తుంటాయి. శ్రీకాంత్‌తో కలిసి పని చేయడం ఇది రెండోసారి. స్వాతి ఈ పాత్ర కోసం చాలా కష్టపడింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేశాం’’ అన్నారు దర్శకుడు శ్రీకాంత్‌. ఈ కార్యక్రమంలో స్వాతి, యశ్వంత్‌, శ్రేయ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *