#Cinema

Kalki: అందుకే ‘కల్కి’ బడ్జెట్‌ ఎక్కువ: ప్రభాస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ . ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభాస్‌ , నాగ్‌ అశ్విన్‌లు ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు.

‘‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది. దేశంలోని గొప్ప నటీనటులను తీసుకున్నాం. నన్ను అందరూ పాన్‌ ఇండియా స్టార్‌ అని పిలుస్తున్నారు. అది నాపై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ, నన్ను అలా పిలవడాన్ని అభిమానులు ఇష్టపడతారు. వాళ్లకు ఆ పిలుపు సంతోషాన్నిస్తుంది’ అని ప్రభాస్‌ అన్నారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) మాట్లాడుతూ.. ‘‘కల్కి’సినిమా చూశాక ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలో ఉంటారు. నేను ‘అవతార్‌’ చూశాక అలాంటి అనుభూతే పొందాను. ఒక కొత్త లోకాన్ని చూసినట్లు అనిపించింది. ఇప్పుడు ‘కల్కి’ (Kalki Movie) చూశాక థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులకు అలానే అనిపిస్తుంది. ఇందులోని పాత్రల పేర్లు కూడా ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ కోసం పెట్టాం. వీటిలో ఎలాంటి మార్పులు చేయం’ అని స్పష్టం చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్‌తో సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఇందులో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఆవిష్కరించారు. ఆ వెహికల్‌ను పలు నగరాల్లో నడుపుతూ టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌ చేస్తోంది. చెన్నై వీధుల్లో ‘బుజ్జి’ (Bujji) చేసిన సందడికి సంబంధించిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ వాహనాన్ని డ్రైవ్‌ చేయాలంటూ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon musk)ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  కోరారు. ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా ఆయన్ను ఆహ్వానించారు. అలాగే బుజ్జి, భైరవకు సంబంధించిన స్పెషల్‌ వీడియో ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Bujji and Bhairava on Prime)లో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ప్రభాస్  సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *