Gaami: విశ్వక్‌సేన్ ‘గామి’పై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

‘గామి’పై దర్శకధీరుడు రాజమౌళి పోస్ట్ పెట్టారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పారు.
విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీని ట్రైలర్‌పై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి (ss Rajamouli) దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్ అఘోరాగా కనిపించనున్నారు. మార్చి 8న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక దీన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయకపోవడంపై విశ్వక్ సేన్ తాజాగా మాట్లాడారు. ‘‘రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ కూడా మొదట ఒక్క భాషలోనే విడుదలైంది. ఆతర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో భాషల్లో రిలీజై సూపర్ సక్సెస్ అయింది. మేము ‘గామి’ విషయంలో అదే ఫాలో అవుతాం. దీనికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టి మిగతా భాషల్లో విడుదల చేస్తాం. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకముంది’ అని అన్నారు.